CWG 2022 Boxing Shiva Thapa enters pre quartors: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ బాక్సర్ శివ థాప అద్భుతం చేశాడు! 60-63.5 కిలోల విభాగం తొలి పోరులో విజయం సాధించాడు. తొలిపోరులోనే పాకిస్థాన్‌ బాక్సర్‌ సులేమాన్‌ బలూచ్‌ను 5-0 తేడాతో చిత్తు చిత్తుగా ఓడించాడు. అతడు విసిరిన పంచ్‌లకు ప్రత్యర్థి వద్ద సమాధానం కరవైంది! అన్ని రౌండ్లలో శివ థాప దూకుడు కనబరిచాడు. పిడిగుద్దులతో చెలరేగాడు. సునాయాయ విజయంతో ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.


ప్రత్యర్థులపై తిరుగులేని విజయాలు అందుకోవడం శివ థాపకు అలవాటే. అతడు స్వింగులో ఉన్నాడంటే బాక్సింగ్‌ రింగులో అవతలి వారికి వణుకు పుట్టిస్తాడు. సులేమాన్‌తో పోలిస్తే సాంకేతికంగా అతడెంతో ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అందుకే పంచ్‌ల వర్షం కురిపించాడు. పుంజుకొని తిరిగి పంచ్‌లు ఇచ్చేందుకు సులేమాన్‌ చేసిన ప్రయత్నాలను అతడు అడ్డుకొన్నాడు. గతంలో ఐదుసార్లు ఆసియా ఛాంపియన్‌షిప్స్‌ గెలవడమే ఇందుకు ఉదాహరణ. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యమూ అతడి సొంతమైంది.