భారత్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో వెస్టిండీస్ కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ విజయానికి 115 చేస్తే సరిపోతుంది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ షాయ్ హోప్ (43: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షాయ్ హోప్, ఆలిక్ అథనజ్ (22: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) తప్ప ఇంకెవరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు దక్కించుకున్నారు. 


స్పిన్నర్లు తిప్పేశారు...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలోనే వెస్టిండీస్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా... డేంజరస్ ఓపెనర్ కైల్ మిల్స్‌ను (2: 9 బంతుల్లో) పెవిలియన్ బాట పట్టించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆలిక్ అథనజ్, మరో ఓపెనర్ బ్రాండన్ కింగ్ (17: 23 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచే ప్రయత్నం చేశారు. ఈ జోడి రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. అయితే నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరూ అవుట్ కావడంతో వెస్టిండీస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. 45 పరుగులకే వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయింది.


అయితే కెప్టెన్ షాయ్ హోప్, షిమ్రన్ హెట్‌మేయర్ (11: 19 బంతుల్లో, ఒక ఫోర్) నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించి వెస్టిండీస్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా షాయ్ హోప్ వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కానీ స్పిన్నర్ల చేతికి బంతి వచ్చాక వెస్టిండీస్ కథ మారిపోయింది. షిమ్రన్ హెట్‌మేయర్‌ను అవుట్ చేసి కుల్దీప్ యాదవ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.


ఆ తర్వాత ఒక్కసారిగా వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. కేవలం 26 పరుగుల తేడాలోనే విండీస్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మిగతా బౌలర్లలో రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.


వెస్టిండీస్ తుది జట్టు
షాయ్ హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, అలిక్ అథానాజ్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, డొమినిక్ డ్రేక్స్, జేడెన్ సీల్స్, గుడాకేష్ మోటీ


భారత్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్