World Cup 2023: టెస్టు క్రికెట్‌ను తమ ఆటతీరుతో కొత్త పుంతలు తొక్కిస్తున్న ఇంగ్లాండ్   టెస్టు క్రికెట్ జట్టు సారథి బెన్ స్టోక్స్.. తిరిగి వన్డేలలో ఆడతాడా..?  ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో అతడిని చూడొచ్చా..?  అని  ఇంగ్లాండ్ క్రికెట్‌లో జరుగుతున్న చర్చకు  బెన్ స్టోక్స్ తన సమాధానంతో ఫుల్ స్టాప్ పెట్టాడు.  తాను వన్డేల నుంచి  రిటైర్ అయ్యానని, మళ్లీ వచ్చే ప్రసక్తే లేదని  చెప్పుకొచ్చాడు. 


యాషెస్ సిరీస్‌లో భాగంగా  ది ఓవల్ వేదికగా  జరుగుతున్న ఐదో టెస్టుకు ముందు   నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్టోక్స్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది.  అక్కడికి వచ్చిన పలువురు   రిపోర్టర్స్.. ‘మీరు వన్డే వరల్డ్ కప్‌లో ఆడతారా..?’ అని ప్రశ్నించారు. దానికి  స్టోక్స్ మాట్లాడుతూ.. ‘వన్డే క్రికెట్ నుంచి  నేను రిటైర్ అయ్యాను.  ఓవల్ టెస్టు తర్వాత  నేను  లాంగ్ హాలీడేకు వెళ్తున్నాను..’అని చెప్పాడు. 


2019 వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో  స్టోక్స్  వీరోచిత పోరాటంతో ఇంగ్లాండ్ తన తొలి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే.   అయితే  టెస్టు సారథిగా పగ్గాలు చేపట్టాక  స్టోక్స్.. 2022లో భారత్ - ఇంగ్లాండ్ మధ్య  జరిగిన  వన్డే సిరీస్‌కు ముందు తాను 50‌ ఓవర్ల ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  అయితే ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో  స్టోక్స్‌ను రిటైర్మెంట్ నుంచి బ్యాక్ రావడానికి  ఇంగ్లాండ్ వైట్ బాల్  కెప్టెన్ జోస్ బట్లర్, కోచ్ మాథ్యూ మాట్  ప్రయత్నిస్తున్నారని  వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ తన నిర్ణయం మారదని చెప్పకనే చెప్పాడు.


 






‘అవును. నేను  యాషెస్ ముగిసిన తర్వాత  కొన్నిరోజులు విరామం తీసుకుంటాను.  అంతకంటే ముందు  నేను నా మోకాలి గురించి చింతించకుండా   బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలగాలి.   ప్రస్తుతం నా దృష్టి మొత్తం దానిమీదే ఉంది. వైద్యులను సంప్రదించి పూర్తిగా మెరుగయ్యేలా  చూసుకోవాలి’ అని చెప్పాడు.  స్టోక్స్ చాలాకాలంగా మోకాలిగాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇదే కారణంతో  స్టోక్స్.. ఐపీఎల్ - 16 లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఈ రెండింటిలో కూడా బౌలింగ్ చేయలేదు. ఇక యాషెస్‌లో కూడా  అవసరమైతే తప్ప బౌలింగ్ కు రాలేదు.   యాషెస్ ముగిసిన తర్వాత ఈ ఏడాది  ఇంగ్లాండ్‌కు టెస్టులు లేవు.  సుమారు  ఐదు నెలల పాటు ఆ జట్టు టెస్టులు ఆడకపోవచ్చు. ఈ నేపథ్యంలో తమకు దొరికిన విరామాన్ని స్టోక్స్ తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు  గాయాల బెడద నుంచి  బయటపడటానికి ఉపయోగించుకోనున్నాడు.  




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial