Arjun Tendulkar Six Pack: భారత క్రికెట్ జట్టులోకి రావాలంటే  ఆట ఒక్కటే కాదు ఫిట్‌నెస్ ముఖ్యం. ఇటీవల ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో  ఈ విషయం మరోసారి  నిరూపితమైంది. అధిక బరువు, పిట్‌నెస్ కారణంగానే అతడికి  జాతీయ జట్టులో అవకాశాలు రావడం లేదని  స్వయంగా  బీసీసీఐ  ప్రతినిధి ఒకరు తెలిపిన విషయం తెలిసిందే.  టీమ్ సెలక్షన్స్‌లో కీ రోల్ పోషిస్తున్న ఫిట్‌నెస్‌పై ఔత్సాహిక ఆటగాళ్లంతా దృష్టి సారిస్తున్నారు. తాజాగా  భారత క్రికెట్ జట్టు దేవుడు సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్..  సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో  తన ఫిట్‌నెస్ లెవల్స్‌ను చూపించాడు.  


ప్రస్తుతం  దేశవాళీ  క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన దేవ్‌దార్ ట్రోఫీలో భాగంగా సౌత్ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అర్జున్.. తన ఇన్‌స్టాగ్రామ్‌  స్టోరీస్‌లో సిక్స్ ప్యాక్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేశాడు. ఫుల్ టోన్డ్ బాడీతో  బాక్సర్ మీద తన యాబ్స్‌ను చూపిస్తూ జూనియర్ సచిన్ షేర్ చేసిన ఫోటో  ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 


 






కోహ్లీతో మొదలు.. 


టీమిండియా ఫిట్‌నెస్ ప్రమాణాలను మెరుగుపరచడంలో మహేంద్ర సింగ్ ధోని  చాలామంది ఆటగాళ్లకు  స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత  విరాట్ కోహ్లీ దానిని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాడు.  ఒకరకంగా టీమిండియాలో సిక్స్ ప్యాక్ చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ పేరునే చెబుతారు. మ్యాచ్‌లో  ఎప్పుడో అప్పుడు ఫెయిల్ అవుతాడేమో గానీ కోహ్లీ  ఫిట్‌నెస్ విషయంలో మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవలేదు.  కోహ్లీ తర్వాత సిక్స్ ప్యాక్ ట్రై చేసినవారిలో శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్,    శుభ్‌మన్ గిల్ కూడా  ఉన్నారు.  కోల్‌కతా నైట్ రైడర్స్  రెస్య్యూ మెన్ (ఆపద్భాంధవుడు) రింకూ సింగ్ కూడా వీళ్లలాంటి టోన్డ్ బాడీనీ మెయింటెన్ చేస్తున్నాడు. తాజాగా ఈ జాబితాలో  అర్జున్ కూడా చేరడం విశేషం.


23 ఏండ్ల అర్జున్  ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు.  మొన్నటి సీజన్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు.  కఠినమైన జిమ్ వర్కవుట్స్,  డైట్,  ఔట్ డోర్‌లో చేసే  ఎక్సర్‌సైజెస్ ద్వారా  అర్జున్ ఈ  టోన్డ్ బాడీని  తీసుకొచ్చాడు.   అర్జున్ తన ఇన్‌స్టాలో ఈ ఫోటో షేర్ చేయగానే  నెటిజన్లు..  అతడిని విరాట్ కోహ్లీ  సిక్స్ ప్యాక్  మాదిరిగానే ఉందని  ప్రశంసలు కురిపిస్తున్నారు. 


ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో  భాగంగా గోవా తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లోనే  సెంచరీ చేసిన అర్జున్ ఆల్ రౌండర్‌గా ఎదుగుతున్నాడు.   ప్రస్తుతం అర్జున్.. పుదుచ్చేరి వేదికగా  జరుగుతున్న  దేవ్‌దార్ ట్రోఫీలో  భాగంగా   సౌత్ జోన్‌కు ఆడుతున్నాడు. అయితే అతడు సౌత్ జోన్ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ బెంచ్‌కే పరిమితయ్యాడు.  ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడిన సౌత్ జోన్.. రెండింటిలోనూ గెలిచి పాయింట్ల పట్టికలో  అగ్రస్థానంలో కొనసాగుతోంది. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial