India look to bring giantkillers USA down to earth: టీ 20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో ఊపు మీదున్న రెండు జట్లు కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. నేడు ఆతిథ్య అమెరికాతో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇరు జట్లు విజయం సాధించగా ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. పసికూన అమెరికా జట్టు ఏకంగా  మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ను ఓడించడం భారత్‌తో జరిగే మ్యాచ్‌పై  ఉత్కంఠ రేపుతోంది. ఈ ప్రపంచకప్‌లో అదరగొడుతున్న పసికూన అమెరికా జట్టుపై అందరి దృష్టి నెలకొంది. అమెరికా ఈ ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌ గెలుస్తుందని భావిస్తే అంచనాలకు మించి రాణిస్తోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్‌-8లో రేసులో ముందుంది. మాజీ ఛాంపియన్‌ పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన అమెరికా ఇప్పుడు టీమ్‌ఇండియాతో మ్యాచ్‌కు సై అంటోంది. న్యూయార్క్‌ వేదికగా భారత్‌తో తలపడనుంది. 
 

ఊపు మీదున్న ఇరు జట్లు

పాకిస్థాన్‌ను సూపర్ ఓవర్‌లో ఓడించి మంచి ఊపు మీదున్న USA భారత్‌తో జరిగే మ్యాచ్‌లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. అమెరికా జట్టులో భారతి సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు హ్యాట్రిక్‌ సాధించడం సహా సూపర్‌-8 బెర్తును ఖాయం చేసుకుంటుంది. అమెరికా జట్టు విజయాల్లో కెప్టెన్‌ మోనాంక్ పటేల్‌, బౌలర్లు సౌరభ్‌ నేత్రావాల్కర్‌, హర్మిత్‌సింగ్, జస్‌దీప్ సింగ్, నితీశ్‌కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. పాకిస్థాన్‌పై మోనాంక్‌ పటేల్‌ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. ఆరోన్ జోన్స్ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కెనడాపై 94 పరుగులు చేసి అజేయంగా నిలిచి అమెరికాకు ఘన విజయాన్ని అందించాడు. ఆంద్రీస్ గౌస్ పాక్‌తో మ్యాచ్‌లోనూ వీరిద్దరూ రాణించారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి భారత్ ప్రణాళికలు రచించాల్సి ఉంది. అమెరికా స్పిన్నర్‌ నోస్తుష్ కెంజిగేతో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు పడగొట్టాడు. ఐర్లాండ్‌పై సునాయసంగా నెగ్గిన రోహిత్ సేన పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. బౌలర్లు అదరగొట్టడం వల్ల 120 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ విజయంతో భారత జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. న్యూయార్క్‌లో రెండు మ్యాచ్‌లు ఆడటం వల్ల అక్కడి పరిస్థితులపై భారత జట్టుకు అవగాహన ఏర్పడింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబె ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. భారత్‌ సూపర్‌-8 చేరడం దాదాపు ఖాయం కావడం వల్ల వీరు ఫామ్‌ను అందిపుచ్చుకోవాల్సిన అవసరముంది. హార్దిక్‌ పాండ్య, బుమ్రా కీలకం కానున్నారు. 

 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్.

అమెరికా: స్టీవెన్ టేలర్, మోనాంక్ పటేల్ (కెప్టెన్‌, వికెట్ కీపర్‌), ఆంద్రీస్ గౌస్, ఆరోన్ జోన్స్, నితీశ్‌ కుమార్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, జస్‌దీప్‌ సింగ్, నోస్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.