Virat Kohli Statement:


ఫామ్‌లో లేనప్పుడు నిరాశ, నిస్పృహలు వెంటాడాయని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఎంత ప్రయత్నించినా తన ఆటను ఆస్వాదించలేక పోయానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్‌ చేసినప్పుడూ చిరాకూ వచ్చేదని వెల్లడించాడు. ఆ సమయంలో తన చుట్టూ ఉన్న క్రికెటర్లను చూస్తే తనంత చెత్త ఆటగాడు మరొకరు లేరేమో అనిపించేదన్నాడు. శ్రీలంకతో తొలి వన్డేలో టీమ్‌ఇండియా విజయం సాధించాక అతడు సూర్యకుమార్‌ యాదవ్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు.


గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 374 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను 306/8కి పరిమితం చేసింది. 67 తేడాతో విజయ ఢంకా మోగించింది. విరాట్‌ కోహ్లీ 87 బంతుల్లోనే 12 బౌండరీలు, ఒక సిక్సర్‌ సాయంతో 113 పరుగులు చేశాడు. అతడికి 45వ వన్డే సెంచరీ. అంతేకాకుండా సొంతగడ్డపై సచిన్‌ 20 సెంచరీల రికార్డును సమం చేశాడు. మ్యాచ్‌ ముగిశాక ఫామ్‌ కోల్పోయినప్పటి విషయాలు పంచుకున్నాడు.


'ఫామ్ లేకపోవడంతో అభిమానుల అంచనాలు అందుకోలేకపోయాను. నాలో చిరాకు మొదలైంది. ఎందుకంటే అంచనాలకు తగ్గట్టే ఎప్పట్లాగే ఆడాలని భావించా. నేనిలాగే ఇలాగే ఇలాగే ఆడాలని పట్టుదలకు పోయాను. కానీ అదే ఫ్యాషన్‌లో ఆడేందుకు క్రికెట్‌ నన్ను అనుమతించలేదు. దాంతో నేను నా ఆటకు మరింత దూరంగా వెళ్లిపోయాను. నా కోరికలు, అనుబంధాలు ఎటో వెళ్లిపోయాయి' అని కోహ్లీ అన్నాడు.


'నా యదార్థ స్థితి నుంచి దూరం వెళ్లిపోవద్దని అప్పుడే గుర్తించాను. నాలాగే ఉండాలనుకున్నాను. బాగా ఆడకున్నా, మరీ చెత్తగా ఆడినా అంగీకరించాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే అలా చేయకుంటే కోపం, చిరాకు ఎక్కువవుతున్నాయి. అదెప్పుడూ మంచిది కాదు. నా చుట్టూ ఉన్నవాళ్లకీ నష్టమే.  అనుష్క, నా సన్నిహితులకూ ఇబ్బందే. నేనలాంటి పరిస్థితుల్లో ఉంటే నన్ను ఇష్టపడేవాళ్లు, మద్దతిచ్చేవాళ్లకు బాగుండదు. బాధ్యతలు తీసుకోవాలని అనుకున్నా' అని విరాట్‌ వివరించాడు.


నిరాశ, నిస్పృహ మరింత పెరగడంతో విరామం తీసుకోవడమే మంచిదని గ్రహించానని కోహ్లీ తెలిపాడు. విశ్రాంతి తర్వాత ఆసియాకప్‌కు ఎంపికయ్యానని పేర్కొన్నాడు. 'అప్పుడు ప్రాక్టీస్‌ను ఎంజాయ్‌ చేయడం గమనించాను. ఇంకా ఇంకా సాధన చేయాలన్న ఇష్టం పెరిగింది. నేను క్రికెట్‌ ఆడే పద్ధతీ అదే. నేనిప్పుడు చెప్పేదొక్కటే. నిరాశ ఎదురైనప్పుడు బలవంతంగా ముందుకెళ్లడం కన్నా ఓ రెండు అడుగులు వెనక్కి వేయండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు' అని వెల్లడించాడు.