IND vs SL T20I:
శ్రీలంకతో రెండో టీ20లో తొలుత బౌలింగ్ చేయడాన్ని టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ సమర్థించాడు. మంచు కురుస్తుందని తెలిసినప్పుడు బౌలింగ్ ఎంచుకోవడంలో తప్పేం లేదన్నాడు. ప్రతిసారీ చరిత్రను బట్టే నిర్ణయాలను తీసుకోలేమని స్పష్టం చేశాడు. మరికొన్ని వికెట్లు ఉండుంటే కచ్చితంగా గెలిచేవాళ్లమని ధీమా వ్యక్తం చేశాడు.
'పుణెలో రెండో ఇన్నింగ్సు సమయంలో చాలా మంచు కురిసింది. ఛేదనలో త్వరగా వికెట్లు చేజార్చుకోవడం వల్లే ఓడిపోయాం. కొన్ని వికెట్లు ఉండుంటే కచ్చితంగా గెలిచేవాళ్లం. అప్పటికీ లక్ష్యాన్ని సమీపించాం. ప్రతిసారీ చరిత్రను బట్టే నిర్ణయాలు తీసుకోలేం. పిచ్ చాలా బాగుంది. సరైన ప్రాంతాల్లో బంతులు వస్తే ఫాస్ట్ బౌలర్లకు సహకరించింది. లంకేయులు చక్కగా ఆడి 206 చేశారు. మేం కొన్ని తప్పిదాలు చేశాం. మంచు కురుస్తుంటే లంక స్పిన్నర్లకు బౌలింగ్ కష్టమవుతుందనే ఛేదనకు దిగాం' అని ద్రవిడ్ వివరించాడు.
యువ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65)ను ద్రవిడ్ ప్రశంసించాడు. రోజురోజుకీ అతడి బ్యాటింగ్ మరింత మెరుగవుతోందని అభినందించాడు. 10 ఓవర్లకు 57/5తో కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియా అతడి వల్లే లక్ష్యానికి చేరువైందన్నాడు. 'అక్షర్ బంతితో ఏం చేయగలడో మనందరికీ తెలుసు. ఇప్పుడు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాడు. ఏడాదికి పైగా జట్టుతో ప్రయాణిస్తున్నాడు. తన లోపాలు గుర్తించి సరిదిద్దుకుంటున్నాడు. జడ్డూ గాయపడటంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. అతడు మూడు ఫార్మాట్లలో రాణిస్తుండటం శుభపరిణామం' అని ద్రవిడ్ అన్నాడు.
టీమ్‌ఇండియాలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు చాలామంది ఉన్నారని ద్రవిడ్ పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ అద్భుతంగా చేస్తాడని ప్రశంసించాడు. షాబాజ్ అహ్మద్ సైతం రెండింట్లో రాణించగలడన్నాడు. జడేజా తిరిగొస్తే మరింత బలం చేకూరుతుందని చెప్పాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యపై ఎక్కువ ఆధారపడుతున్నామని వివరించాడు. రెండో టీ20లో శివమ్ మావి బ్యాటింగ్ చేసిన తీరు ఆకట్టుకుందన్నాడు. ఫాస్ట్ బౌలర్లు సిక్సర్లు కొడుతుంటే ముఖంపై నవ్వులు వెల్లివిరుస్తాయని తెలిపాడు.