IND vs SL: భారత్ - శ్రీలంక మధ్య కొలంబో వేదికగా ఆదివారం ముగిసిన ఫైనల్‌లో లంకను చిత్తు చేసిన తర్వాత భారత జట్టు ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా సారథి.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడి నుంచి ట్రోఫీని అందుకున్నాక ఆటగాళ్లకు ఇచ్చాడు. టీమ్‌లో యంగెస్ట్ లేదా కొత్తగా ఆడుతున్న క్రికెటర్‌కు ట్రోఫీని ఒడిసిపట్టే ఘట్టం తర్వాత భారత ఆటగాళ్ల నుంచి ఒక వ్యక్తి ట్రోఫీని తీసుకుని దానిని పైకెత్తి ఫోటోలకు ఫోజులిచ్చాడు. భారత క్రికెటర్లు సైతం అతడి మీద చేతులు వేసి సంతోషాన్ని పంచుకున్నారు. అతడు భారత క్రికెట్ జట్టు సభ్యుడు కాదు. కోచింగ్ స్టాప్‌లో లేడు. ఫిజియోనో లేక ట్రైనరో కూడా కాదు. మరి ఎవరతను..?
ఎవరితడు..?
భారత ఆటగాళ్ల నుంచి ట్రోఫీ తీసుకుని ఫోటోలకు ఫోజులిచ్చిన వ్యక్తి పేరు రఘు రాఘవేంద్ర. ఆటగాడు, కోచింగ్, మెడికల్ స్టాఫ్ కాకపోయినా భారత జట్టులో అతడు కీలక సభ్యుడు. రఘు టీమిండియాకు ‘త్రో డౌన్ స్పెషలిస్ట్’. అంటే భారత ఆటగాళ్లు నెట్స్‌లో బౌలర్ల కంటే ఎక్కువగా ఎదుర్కునేది ఇతడు విసిరే బంతులే. ప్రాక్టీస్ సెషన్స్‌లో టీమిండియాకు ఇతడే కీలకం. స్లింగర్ (బంతిని విసరడానికి వాడే సాధనం) సాయంతో బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్‌లో అతడు కీలకంగా వ్యవహరిస్తున్నాడు.
సుదీర్ఘ ప్రయాణం..
భారత క్రికెట్ జట్టుతో రఘు రాఘవేంద్ర ప్రయాణం ఇప్పటిది కాదు. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిలకు కూడా అతడు ప్రాక్టీస్ సెషన్స్‌లో బంతులు విసిరాడు. 2011లోనే అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) నుంచి భారత క్రికెట్‌లో త్రో డౌన్ స్పెషలిస్టుగా నియమితుడయ్యాడు. దశాబ్దకాలానికి పైగా భారత జట్టుతో మమేకమవుతున్న రఘుతో పాటు ఇటీవల కాలంలో భారత్ మరో ఇద్దరు త్రో డౌన్ స్పెషలిస్టులను కూడా నియమించుకుంది.
గతంలో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా రఘుపై ప్రశంసలు కురిపించాడు. ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్ మాత్రమే బయట జనాలకు తెలుసునని, ఇలాంటి వాళ్లకూ గుర్తింపు ఇవ్వాలని కోహ్లీ ఓ వీడియో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. తమ విజయం వెనుక వీరి కృషి ఎంతో ఉందని అన్నాడు.
గత టీ20 వరల్డ్ కప్‌లో వెలుగులోకి..
ఆస్ట్రేలియా వేదికగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో భారత్ - బంగ్లాదేశ్ మ్యాచ్ గుర్తుందా..? భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లా బ్యాటర్లు వీరవిహారం చేస్తుండగా వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. అయితే వర్షం ముగిశాక ఆట తిరిగి ఆరంభం కాగా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆటగాళ్లు జారి పడే ప్రమాదం ఉండటంతో బౌండరీ లైన్ చుట్టూతా తిరుగుతూ ఆటగాళ్ల షూస్‌కు అంటిన మట్టిని తొలగించింది కూడా రఘు రాఘవేంద్రనే. ఈ సందర్భంగా అతడికి నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తాయి. స్వతహాగా సిగ్గరి అయిన రాఘవేంద్ర.. ప్రాక్టీస్ సెషన్స్‌లో మాత్రం పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటాడు.
సిఫారసు చేసింది మాస్టర్ బ్లాస్టర్..
కర్నాటకకు చెందిన రాఘవేంద్ర క్రికెటర్ కావాలని కలలుకన్నాడు. భారత క్రికెట్‌ను ఏలుదామని కర్నాటక నుంచి ముంబైకి మకాం మార్చిన రాఘవేంద్ర అక్కడి రాజకీయాలకు విసిగిపోయి తన రూట్ మార్చుకున్నాడు. బెంగళూరుకు తిరిగొచ్చి ఎన్‌సీఏలో తనకు ఉన్న స్కిల్స్ గురించి పెద్దలకు విన్నవించి అక్కడ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్‌సీఎలో అతడు సచిన్, ద్రావిడ్, ధోని వంటివారికి బంతులు విసిరాడు. తనలోని ప్రతిభను గుర్తించిన సచిన్.. రఘు పేరును బీసీసీఐకి రికమెండ్ చేశాడు. సచిన్ సిఫారసు మేరకు 2011-12లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టుతో పాటు రాఘవేంద్ర కూడా జతకలిశాడు. ఆ తర్వాత కొద్దిరోజులు వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైనా 2014 నుంచి భారత జట్టుతోనే కొనసాగుతున్నాడు. భారత బ్యాటర్ల విజయాలలో రాఘవేంద్ర పాత్ర కనిపించని విజయం వంటిది. టీమిండియా అతడికి పెట్టిన ముద్దు పేరు ‘గోల్డెన్ ఆర్మ్’.. అతడి స్కిల్స్ చూసి అగ్రశ్రేణి జట్ల నుంచి మంచి ఆఫర్స్ వచ్చినా తనకు టీమిండియాను మించిన ఆస్తులేవీ వద్దని పదేండ్లకు పైగా భారత్‌తోనే కొనసాగుతున్నాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial