IND VS SL 1st Test, Mohammad Kaif Criticizes Rishabh Pant Dismissal: శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అవుటైన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్రీజులో కుదురుకున్న తర్వాత 62 బంతుల్లో 39 రన్స్ చేసి మంచి స్కోరు దిశగా సాగుతున్న సమయంలో అనవసరమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. శ్రీలంక 81వ ఓవర్లో రెండో కొత్త బంతిని తీసుకున్న వెంటనే పంత్ క్రీజు వదిలి ముందుకు వచ్చి భారీ షాట్ ఆడబోయాడు. అయితే బంతి బ్యాట్ కింది భాగానికి తగిలి మిడ్ ఆఫ్ లో క్యాచ్ గా వెళ్లింది. పంత్ ఆడిన ఈ షాట్ సెలెక్షన్‌ను భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా తప్పుబట్టాడు.
కామన్ సెన్స్ వాడాలి.. కొత్త బంతిని చూడకుండానే అటాక్తాజాగా ఒక ఛానెల్ లో మాట్లాడిన మహమ్మద్ కైఫ్, పంత్ బ్యాటింగ్ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. "పంత్ అవుటైన విధానంపై నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు, అతడు ఎప్పుడూ అలాగే ఆడతాడు. కానీ కామన్ సెన్స్ ఉండాలి కదా అన్నదే నా అభ్యంతరం. లంక టీమ్ కొత్త బంతి తీసుకున్న మొదటి ఓవర్ అది. ఆ ఓవర్లోనే అతడు మూడుసార్లు క్రీజు వదిలి ముందుకు దూకాడు. కామన్ సెన్స్ ఉంటే కట్ షాట్ ఆడేవాడు. టెస్ట్ మ్యాచ్ సంప్రదాయం ప్రకారం కొత్త బంతి ప్రభావం తగ్గే వరకు కనీసం ఐదారు ఓవర్లు వేచి చూడాలి. ఎంత దూకుడుగా ఆడే ప్లేయర్ అయినా కనీస ఆలోచన ఉపయోగిస్తాడు" అని పేర్కొన్నాడు.
150 రన్స్ చేసినా బంతులు వదిలేస్తారు.. మిగతా బ్యాటర్లలో ఉండే క్రికెటింగ్ లాజిక్ పంత్ లో కనిపించలేదని కైఫ్ చెప్పాడు. "ఓవర్ తొలి బంతికే అతడు ముందుకు దూకడం నన్ను ఆశ్చర్యపరిచింది. కొద్దిగానైనా మ్యాచ్ పరిస్థితిని లెక్కించాలి. ఒక బ్యాటర్ 150 రన్స్ మీద ఉన్నా కూడా కొత్త బంతి వచ్చినప్పుడు కొన్ని బంతులను జాగ్రత్తగా ఆడతాడు. అందుకే పంత్ కు నేను కొన్ని మార్కులు కట్ చేస్తున్నాను. క్రికెటింగ్ సెన్స్, లాజిక్ విషయంలో అతడు చాలా వెనుకబడిపోయాడు" అని విశ్లేషించాడు. పంత్‌ను లంక అరంగేట్ర బౌలర్ కేశర నువాంత పెవిలియన్ పంపాడు.
పీకల్లోతు కష్టాల్లో లంక.. 5 వికెట్లు డౌన్ఇక తొలి టెస్టులో శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత్ సాధించిన తొలి ఇన్నింగ్స్ స్కోరు 462ను మ్యాచ్ చేసేందుకు తంటాలు పడుతుంది. కడపటి వార్తలందేసరికి 26.3 ఓవర్లలో 5 వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ లాహిరు ఉదారా (27) టాప్ స్కోరర్ గా నిలిచాడు. మానవ్ సుతార్ కు రెండు, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కు తలో వికెట్ దక్కింది. ప్రస్తుతం భారత్ కంటే 372 పరుగుల వెనుకంజలో నిలిచింది.
