IND vs SL 1st ODI: మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తో పాటు బౌలింగ్ లో మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లు రాణించటంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. లంక కెప్టెన్ దసున్ షనక అద్భుత సెంచరీతో పోరాడినప్పటికీ తన జట్టును గెలిపించుకోలేకపోయాడు. అయితే శనక శతకం నాటకీయ పరిణామాల మధ్య పూర్తయ్యింది. 


శ్రీలంక బ్యాటర్లందరూ విఫలమైన వేళ ఆ జట్టు కెప్టెన్ శనక విజయం కోసం చివరి వరకు పోరాడాడు. శ్రీలంక విజయానికి ఇన్నింగ్స్ చివరి 3 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి వచ్చింది. అప్పటికి శనక 98 పరుగులతో ఉన్నాడు. బౌలింగ్ చేస్తున్న షమీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న శనకను రనౌట్ (మన్కడింగ్) చేశాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్ టీవీ అంపైర్ కు అప్పీల్ చేశాడు. అయితే భారత కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ అప్పీల్ ను వెనక్కు తీసుకున్నాడు. దీంతో శనక తర్వాత తన సెంచరీని పూర్తిచేసుకున్నాడు. దీనిపై మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడాడు.


అందుకే అప్పీల్ ను వెనక్కు తీసుకున్నా


'షమీ అలా (మన్కడింగ్) చేశాడని నాకు తెలియదు. మేం శనకను ఔట్ చేయాలనుకున్నాం కానీ ఇలా కాదు. అసలు నాన్ స్ట్రైకర్ రనౌట్ చేయాలనే ఆలోచన మాకు లేదు. అతడు అద్భుతంగా ఆడాడు.' అని రోహిత్ అన్నాడు. అలాగే తమ ఇన్నింగ్స్ కూడా బాగా సాగిందని చెప్పాడు. కఠిన పరిస్థితుల్లో కూడా తమ బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారని అభినందించాడు. చివరికి ఆఖరి బంతికి శనక తన సెంచరీని పూర్తిచేసుకున్నాడు. 


భారత్ ఘనవిజయం


శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో లీడ్ లో నిలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటిన భారత్ శ్రీలంకను 67 పరుగుల తేడాతో ఓడించింది. సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. శ్రీలంకతో తొలి వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 143 పరుగుల రికార్డు భాగస్వామ్యం అందించారు. రోహిత్ శర్మ (83), శుభ్ మన్ గిల్ (70) రాణించారు. విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీ (87 బంతుల్లో 113 పరుగులు)తో శ్రీలంక ముందు 373 లక్ష్యం ఉంచింది భారత్. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక బ్యాట్స్ మెన్ భారత్ పేసర్ల దాటికి క్రీజ్ లో నిలవలేకపోయారు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3 వికెట్లు, మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, మహమ్మద్ షమీ, హార్థిక్ పాండ్యా, చాహల్ చెరో వికెట్ తీశారు.