రాంచీ: దక్షిణాఫ్రికాతో ఆదివారం ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ (ODI) సిరీస్‌లో KL రాహుల్  భారత్‌కు సారథిగా వ్యవహరిస్తాడు. భారత్, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టులో గాయపడిన శుభ్‌మన్ గిల్ స్థానంలో బీసీసీఐ రాహుల్‌కు తాత్కాలికంగా వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. 

Continues below advertisement

రెగ్యూలర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అయినప్పటికీ, 'వన్డేల మాస్టర్', అనుభవజ్ఞుడైన విరాట్ కోహ్లీ  జట్టులో ఉన్నాడని కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. తొలి వన్డేకు ముందురోజు రాహుల్ రాంచీలో విలేకరులతో మాట్లాడుతూ ఏమన్నారంటే.. "బౌండరీలు కొట్టడం ఎంత ముఖ్యమో, సింగిల్స్ తీయడం అంతే ముఖ్యం. విరాట్ తన కెరీర్‌లో ఇది బాగా చేశాడు. ఎలా మెరుగవ్వాలి, గేమ్ ప్లాన్ ఎలా ఉండాలనే విషయంపై డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీతో చర్చించేవాళ్లం. ఎందుకంటే వన్డే క్రికెట్‌కు మాస్టర్ కింగ్ కోహ్లీ. అతన్ని తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌లో చూడటం చాలా బాగుంది" అన్నాడు.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. జట్టులో మరింత నమ్మకం పెరుగుతుంది. ఆ ఇద్దరూ జట్టులో ఉండటం మాకు కలిసొస్తుంది. వారికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి. వారు డ్రెస్సింగ్ రూమ్‌పై ఒత్తిడి తగ్గిస్తారని నమ్మకం ఉందని" రాహుల్ పేర్కొన్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే  ఆదివారం, నవంబర్ 30, 2025న రాంచీ వేదికగా జరగనుంది. ఇక్కడికి వచ్చిన సందర్భంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టీమిండియా ఆటగాళ్లకు డిన్నర్ పార్టీ ఇచ్చాడని తెలిసిందే.

Continues below advertisement

విరాట్ కోహ్లీ వన్డే గణాంకాలు

విరాట్ కోహ్లీ 305 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లలో 293 ఇన్నింగ్స్‌లలో 14,255 పరుగులు చేశాడు. 51 సెంచరీలు, 75 అర్ధ సెంచరీలు కోహ్లీ ఖాతాలో ఉన్నాయి. కోహ్లీ తన చివరి వన్డే సిడ్నీలో ఆస్ట్రేలియాతో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆదివారం జరిగే భారత్, దక్షిణాఫ్రికా తొలి వన్డే కోసం జట్టును ఇంకా ప్రకటించనప్పటికీ, ప్లేయింగ్ XIలో కోహ్లీ, రోహిత్ శర్మ కచ్చితంగా ఉంటారు. వారిద్దరూ ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక ఫార్మాట్ ఇదే.

వన్డేలలో దక్షిణాఫ్రికాతో విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లలో కోహ్లీ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. కోహ్లీ ఇప్పటివరకు సఫారీలపై 29 ఇన్నింగ్స్‌లు ఆడగా, 1,504 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 65.4 సగటుతో విరాట్ కోహ్లీ సొంత గడ్డపై ప్రోటీస్‌పై ఆధిపత్యం చెలాయించాడు. ఈ ఫార్మాట్‌లో తన అద్భుతమైన రికార్డును కొనసాగిస్తాడని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ భావిస్తున్నారు.