IND vs SA 3rd T20: ఎట్టకేలకు సఫారీలకు ఊరట! ఇండర్ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో ఆ జట్టు విజయం అందుకుంది. 228 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాను 178కి పరిమితం చేసింది. 49 రన్స్ తేడాతో గెలుపు బావుటా ఎగరేసింది. 1-2 తేడాతో సిరీస్‌ను ముగించింది. ఛేదనలో దీపక్ చాహర్ (31; 17 బంతుల్లో 2x4, 3x6) దినేశ్ కార్తీక్ (26; 21 బంతుల్లో 4x4, 4x6) రాణించారు. మిగతా వాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లారు. అంతకు ముందు దక్షిణాఫ్రికాలో రిలీ రొసో (100*; 48 బంతుల్లో 7x4, 8x6) సెంచరీ, క్వింటన్ డికాక్ (68; 43 బంతుల్లో 6x4, 4x6) హాఫ్ సెంచరీతో అలరించారు.
పెవిలియన్‌కు క్యూ!
భారీ ఛేదనకు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ రెండో బంతికే రోహిత్ శర్మ (0) ఔటయ్యాడు. జట్టు స్కోరు 4 వద్ద శ్రేయస్ అయ్యర్ (1)ను వేన్ పర్నెల్ పెవిలియన్ పంపించాడు. దూకుడుగా ఆడుతున్న రిషభ్ పంత్ (27)ను జట్టు స్కోరు 45 వద్ద ఎంగిడి ఔట్ చేశారు. ఫటాఫట్ సిక్సర్లు, బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీకి చేరువైన దినేశ్ కార్తీక్‌ను మహరాజ్ బుట్టలో వేశాడు. టీమ్‌ఇండియా మిస్టర్ 360 ఆటగాడు సూర్య కుమార్ (9) ఈ సారి రాణించలేదు. దాంతో 86కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. హర్షల్ (17) రెండు బౌండరీలు బాదినా అక్షర్ (9), అశ్విన్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ క్రమంలో దీపక్ చాహర్, ఉమేశ్ యాదవ్ తొమ్మిదో వికెట్‌కు 26 బంతుల్లో 48 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 168 వద్ద దీపక్‌ను ప్రిటోరియస్ ఔట్ చేయడంతో టీమ్‌ఇండియా ఓటమి ఖరారైంది. 18.3 ఓవర్లకు ఆలౌటైంది.
దంచికొట్టిన రొసో, క్వింటన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీలను మరోసారి ఓపెనింగ్ వైఫల్యం వెంటాడింది. కెప్టెన్ తెంబా బవుమా (3) ఉమేశ్ యాదవ్ వేసిన 4.1వ బంతికి ఔటయ్యాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి దక్షిణాఫ్రికా 48-1తో నిలిచింది. ఆ తర్వాత ఓపెనర్ క్వింటన్ డికాక్. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిలీ రొసో దంచికొట్టడం షురూ చేశారు. ఒకరిని మించి మరొకరు బౌండరీలు, సిక్సర్లు కొట్టారు. రెండో వికెట్‌కు 47 బంతుల్లో 89 భాగస్వామ్యం నెలకొల్పారు. డికాక్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడంతో సఫారీలు 10.1 ఓవర్లకే 100 మైలురాయి చేరుకున్నారు. జట్టు స్కోరు 120 వద్ద డికాక్ రనౌట్ కావడంతో రొసో వీర బాదుడు బాదాడు. టీమ్‌ఇండియా బౌలర్లను వెంటాడి మరీ ఊచకోత కోశాడు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 48 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. త్రిస్టన్ స్టబ్స్‌తో కలిసి మూడో వికెట్‌కు 44 బంతుల్లో 87 భాగస్వామ్యం అందించాడు. ఆఖరి ఓవర్లో స్టబ్స్ ఔటైనా మిల్లర్ (19*; 5 బంతుల్లో) హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టు స్కోరును 227-3కి చేర్చాడు.