దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (40: 35 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాప్రికా గెలవాలంటే 120 బంతుల్లో 149 పరుగులు కావాలి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మొదటి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత ఇషాన్ కిషన్ (34: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్‌లపై (40: 35 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పడింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించారు.
అయితే ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (5: 7 బంతుల్లో), హార్దిక్ పాండ్యా (9: 12 బంతుల్లో, ఒక ఫోర్), అక్షర్ పటేల్ (10: 11 బంతుల్లో) విఫలం అయ్యారు. దీంతో స్కోరు కూడా మందగించింది. చివర్లో దినేష్ కార్తీక్ (30: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కొంచెం వేగంగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగలిగింది.