భారత్‌పై తమకున్న చెత్త రికార్డు బద్దలు కావడానికి సిద్ధంగా ఉందని పాకిస్థాన్‌ సారధి బాబర్‌ ఆజమ్‌ ధీమా వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్తాన్‌లు మొత్తం ఏడుసార్లు తలపడగా, అందులో టీమ్‌ఇండియా ప్రతిసారీ విజయం సాధించింది. 1992లో వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరి మధ్య తొలి పోటీ జరిగింది. ఆ తర్వాత 1996, 1999, 2003, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ప్రతి ఒక్కసారీ టీమిండియానే గెలిచింది. ఇప్పటివరకూ భారత్‌పై పాక్‌ విజయం నమోదు చేయలేదు. అయిదే దీనిపై పాక్‌ సారధి బాబర్‌ ఆజమ్ స్పందించాడు. తాను గత రికార్డులను నమ్మనని, ఈసారి మాత్రం ఆ రికార్డులన్నీ బద్దలు కాబోతున్నాయని బాబర్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడిన బాబర్.. గత ప్రపంచకప్‌లో పాక్‌ అన్ని మ్యాచ్‌లు ఓడిపోయిన విషయంపై స్పందించాడు. తాను గతంలో జరిగిన వాటిపై ఎక్కువ శ్రద్ధ పెట్టనని... వాటిని నమ్మనని.. ప్రస్తుతం ఏం జరుగుతుందో దానిపైనే ఎక్కువ దృష్టి  పెడతానని బాబర్‌ అన్నాడు.


 రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అని.. తాము ఈ ప్రపంచకప్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించామని బాబర్‌ ఆజమ్‌ గుర్తు చేశాడు. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో కూడా గెలిచి మూడో విజయం నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో మీపై అధిక ఒత్తిడి ఉంటుందా అన్న ప్రశ్నకు కూడా బాబర్‌ స్పందించాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఎప్పుడూ అధిక ఒత్తిడి ఉంటుందని, కానీ జట్టుగా మేం ఆ ఒత్తిడిని అధిగమిస్తామని బాబర్‌ అన్నాడు. భారత్‌తో మ్యాచ్‌లో తమ ప్రణాళికలు తమకున్నాయని, అహ్మదాబాద్‌లోని లక్షమంది ప్రేక్షకుల ముందు అద్భుత ప్రదర్శన చేస్తామని పాక్‌ సారధి తెలిపాడు. భారత్‌లో పిచ్‌లు కొన్ని స్పిన్‌కు, కొన్ని పేస్‌కు అుకూలిస్తాయని... మరికొన్ని పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని..మేం అన్నింటికి సిద్ధమై వచ్చామని వెల్లడించాడు. 


ఇటు ఈ మ్యాచ్‌పై పాక్ మాజీ పేసర్‌, రావిల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా స్పందించాడు. భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను చూడాలంటే దమ్ము ఉండాలని షోయబ్‌ అక్తర్ వ్యాఖ్యానించాడు. మీరు ధైర్యవంతులైతేనే.. ఈ పోరును ఎంజాయ్‌ చేస్తారని కామెంట్‌ చేశాడు. ఒకవేళ మీరు పిరికివాళ్లైతే ఈ మ్యాచ్‌ను చూడకపోవడమే మంచిదని అక్తర్ హితవు పలికాడు. ఆటగాళ్లు సూపర్ స్టార్లుగా మారేందుకు ఈ మ్యాచ్‌ ఒక అరుదైన అవకాశమన్న రావిల్పిండి ఎక్స్‌ప్రెస్‌... పాకిస్థాన్‌పై తీవ్ర ఒత్తిడి ఉంటుందనేది అవాస్తవమని తన జట్టును వెనకేసుకు వచ్చాడు. భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడం వల్ల పాక్‌పై ఒత్తిడి లేకుండా పోతుందని తన మార్క్‌ విశ్లేషణ చేశాడు.


టీమిండియాను ఫేవరెట్‌గా చూసినప్పుడు పాకిస్థాన్‌ జట్టు అండర్‌డాగ్‌గానే బరిలోకి దిగుతుందని అక్తర్‌ అన్నాడు. ఇప్పుడు పాకిస్థాన్‌ కోల్పేయేదీ ఏమీ లేదని.. కానీ భారత జట్టు పరిస్థితి అలా లేదని ఈ పాక్‌ మాజీ పేసర్‌ అన్నాడు. భారత్‌ను వారి సొంత గడ్డమీదే ఓడించి ప్రపంచకప్‌ గెలిస్తే ఆ మజానే వేరని అక్తర్‌ అన్నాడు. కానీ భారత్‌ను భారత్‌లో ఓడించడం అంత సులువు కాదని అన్నాడు. పాకిస్థాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లో చాలా తెలివిగా ఆడాలని రావిల్పిండి ఎక్స్‌ప్రెస్‌ సూచించాడు. భారత వికెట్లపై భారత్‌ను ఓడించి అహ్మదాబాద్‌లో ఫైనల్‌ ఆడుతుంటే చూడాలని ఉందని కూడా అక్తర్‌ వ్యాఖ్యానించాడు.