ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ముచ్చటగా మూడో మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని దాయాది జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ సేనను పాకిస్థాన్ అడ్డుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. షహీన్ షా అఫ్రీదీ సహా పాక్ సీమర్లను రోహిత్ బ్యాటింగ్ దళం ఎలా ఎదుర్కొంటుందో అన్న ఉత్కంఠ అభిమానులను ఊపేస్తోంది. 2016లో జరిగిన టీ 20 ప్రపంచకప్ సందర్భంగా భారత గడ్డపై ఇరు జట్లు పోటీ పడ్డాయి. ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ పాకిస్థాన్‌తో జరిగిన అన్ని మ్యాచ్‌లను భారత్ విజయం సాధించింది. ఇప్పుడూ ఆ రికార్డును మరింత పెంచుకోవాలని టీమిండియా తహతహలాడుతోంది. ఏడేళ్ల తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాక్ పోటీ పడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రపంచకప్‌లోనే హై ఓల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందా.. అసలు మ్యాచ్ జరిగేటప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
ఆసియాకప్‌లో పాకిస్థాన్‌తో జరగాల్సిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందా అన్న ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. అయితే ఇవాళ అహ్మదాబాద్‌లో వాతావరణం ఆశాజనకంగా ఉంది. వర్షం పడే అవకాశాలు దాదాపు లేవని వాతావరణ శాఖ తెలిపింది. అహ్మదాబాద్‌లో ఇవాళ ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉంటుంది. సాయంత్రం దాదాపు 20 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. బ్యాటర్లు ప్రారంభంలో కాస్త ఓపిగ్గా బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.
ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ నేడు తలపడతాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరుజట్లు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. బ్యాటింగ్ విభాగంలో సారథి రోహిత్, విరాట్ కోహ్లీ, KL రాహుల్ మంచి ఫామ్‌లో ఉండడం సహా బౌలింగ్ విభాగంలో బుమ్రా మెరుపులు భారత్‌ను ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా నిలిపాయి. 1992 నుంచి ఇప్పటివరకూ ఇరు జట్లు ఏడుసార్లు తలపడగా అన్నిసార్లూ భారత్ విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లోనూ ఇదే జోరు కొనసాగించాలని రోహిత్ సేన ఉవ్విళ్లురుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఫేవరేట్‌గా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలోనూ భారత్ జట్టు పటిష్ఠంగానే కనిపిస్తోంది. స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్‌లో ఉండగా స్పిన్నర్లు జడేజా, కుల్‌దీప్ యాదవ్ కూడా రాణిస్తున్నారు. మహ్మద్ సిరాజ్ స్థానంలో మహ్మద్ షమీని తుది జట్టులోకి తీసుకోవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో వెళ్లాలని టీమిండియా భావిస్తే శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజం (సి), షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, మహ్మద్ నవాజ్, ఉసామా మీర్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది , మహ్మద్ వాసిం.