భారత్‌తో జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను భారత బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. 19.5 ఓవర్లలో పాక్ 147 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ విజయానికి 120 బంతుల్లో 148 పరుగులు అవసరం. 


టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. కట్టుదిట్టమైన బంతులతో పరుగుల కోసం చెమటోడ్చేలా చేశారు. భువనేశ్వర్, హార్దిక్ పాండ్య విజృంభించడంతో పాకిస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.  19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా యువ బౌలర్లు అర్ష్‌దీప్, అవేష్ ఖాన్ లు రాణించారు. 


ఓపెనర్లుగా బరిలోకి దిగిన బాబర్ అజాం (10: 9 బంతుల్లో, రెండు ఫోర్లు), మహ్మద్ రిజ్వాన్ (43: 42 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడలేకపోయారు. తొలి ఓవర్లో భువనేశ్వర్ కట్టదిట్టంగా బంతులేశాడు. మూడో ఓవర్లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను భువీ ఔట్ చేశాడు. దీంతో 19 పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫకార్ జమాన్ తో (10: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) కలిసి రిజ్వాన్ స్కోరు బోర్డును కదిలించాడు. వీరిద్దరూ ఆడపాదడపా బౌండరీలు కొడుతూ పరుగులు జతచేశారు.


అవేష్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో జమాన్ ఔటయ్యాడు. అనంతరం రిజ్వాన్ కు జతకలిసిన ఇఫ్తికార్ అహ్మద్ (28: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా పరుగులు రాబట్టాడు. మరోవైపు క్రీజులో కుదురుకున్న రిజ్వాన్ కూడా బ్యాట్ ఝుళిపించటంతో స్కోరు బోర్డు వేగంగా కదిలింది. బలపడుతున్న వీరి భాగస్వామ్యాన్ని హార్దిక్ విడదీశాడు. ఒక షార్ట్ పిచ్ బంతితో ఇఫ్తికార్ ను ఔట్ చేశాడు. అప్పటికి స్కోరు 90 పరుగులు


అనంతరం పాండ్య బౌలింగ్ లోనే కుదురుగా ఆడుతున్న రిజ్వాన్ అవుటయ్యాడు. ఆ తర్వాత పాక్ బ్యాటింగ్ పేకమేడను తలపించింది. వరుస ఓవర్లో వికెట్లు కోల్పోయింది.  అర్ష్‌దీప్, భువనేశ్వర్ టెయిలెండర్ల పనిపట్టారు. అయితే చివర్లో రౌఫ్, దహాని బ్యాట్ ఝళిపించటంతో పాక్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.  భువీ 4, పాండ్య 3, అర్ష్‌దీప్ 2, అవేష్ ఖాన్ ఒక వికెట్లు సాధించారు.