IND vs PAK, Best Cricket Moments: భారత్‌, పాక్‌ క్రికెట్‌ మ్యాచంటే కేవలం ఆట కాదు! అదో యుద్ధం! స్టాండ్స్‌లో అభిమానులు ఎంత భావోద్వేగంతో ఉంటారో మైదానంలో క్రికెటర్ల అంతకు మించే ఎమోషనల్‌ అవుతుంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పోటీపడతారు. పాక్‌ క్రికెటర్లు కవ్విస్తుంటే టీమ్‌ఇండియా ఆటగాళ్ల గట్టిగా బదులిచ్చేవాళ్లు. మరికొన్ని రోజుల్లో ఆసియాకప్‌, ఆపై టీ20 ప్రపంచకప్‌ మొదలవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ఐకానిక్‌ మూమెంట్స్‌ గుర్తు తెచ్చుకుందామా!


సొహైల్‌కు వెంకీ పంచ్‌


సాధారణంగా వెంకటేశ్ ప్రసాద్‌ ఎవ్వరినీ ఏమీ అనడు! అలాంటిది 1996 వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ ఆటగాడు ఆమిర్‌ సొహైల్‌కు ఘాటుగా బదులిచ్చాడు. టీమ్‌ఇండియా నిర్దేశించిన 288 పరుగుల లక్ష్య ఛేదనలో ఆమిర్‌ సొహైల్‌, సయీద్‌ అన్వర్‌ తొలి వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్యం అందించారు. అన్వర్‌ 48కి ఔటయ్యాడు. హాఫ్‌ సెంచరీ కొట్టి సొహైల్‌ మాత్రం జోరు మీదున్నాడు. వెంకటేశ్ ప్రసాద్‌ బంతి అందుకోగానే బౌండరీ కొట్టాడు. ఆ తర్వాతి బంతినీ స్టాండ్స్‌లోకి పంపిస్తానంటూ సంజ్ఞలు చేశాడు. అయితే ఆఫ్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టంప్‌ ఆవల వేసిన బంతికి సొహైల్‌ వికెట్టు గాల్లో తేలింది. అతడు పెవిలియన్‌ వెళ్తుంటే వెంకటేశ్‌ నోటికి పనిచెప్పాడు.


సూపర్‌ సచిన్‌ 


దక్షిణాఫ్రికాలో 2003 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచులో సచిన్‌ తెందుల్కర్‌ బ్యాటింగ్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. 276 ఛేదనలో సచిన్‌, సెహ్వాగ్‌ కేవలం 5 ఓవర్లలోనే 53 రన్స్‌ చేశారు. అయితే సెహ్వాగ్‌, గంగూలీని వకార్‌ యూనిస్‌ వరుస బంతుల్లో ఔట్‌ చేసి షాకిచ్చాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా సచిన్‌ మాత్రం అలాగే నిలబడ్డాడు. 75 బంతుల్లోనే 130 స్ట్రైక్‌రేట్‌తో 98 పరుగులు చేశాడు. 12 బౌండరీలు, ఒక సిక్స్‌ బాది జట్టుకు విజయం అందించాడు.


తొలి భారతీయుడిగా విరాట్‌


2015 వన్డే ప్రపంచకప్‌నకు ముందు టీమ్‌ఇండియాకు ఏమీ కలిసిరాలేదు. ఆసీస్‌ పర్యటనలో చెత్తగా ఆడింది. దాంతో మెగా టోర్నీలో గ్రూప్‌ స్టేజ్‌లోనే వెళ్లిపోతుందని అంతా అంచనా వేశారు. అయితే తొలి మ్యాచులోనే పాక్‌తో తలపడ్డ ధోనీసేన 76 పరుగుల తేడాతో విజయం అందుకుంది. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ 126 బంతుల్లో 107 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లో పాక్‌పై సెంచరీ కొట్టి తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. 300 రన్స్‌ చేసిన టీమ్‌ఇండియా ప్రత్యర్థిని 47 ఓవర్లకు 224కే ఆలౌట్‌ చేసింది.


మియాందాద్‌ కప్పగంతులు


1992 ప్రపంచకప్‌లో జావెద్‌ మియాందాద్‌ తన ఫ్రస్ట్రేషన్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. 217 పరుగుల ఛేదనలో మియాందాద్‌ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. 25వ ఓవర్లో సచిన్‌ వేసిన బంతి అతడి ప్యాడ్లలో చిక్కుకుంది. దాంతో వికెట్‌ కీపర్‌ కిరణ్ మోరె ఎల్బీ కోసం గట్టిగా అప్పీల్‌ చేశాడు. దానికి చిరాకు పడ్డ మియాందాద్‌.. తర్వాత బంతి వేస్తుండగా సచిన్‌ను మధ్యలోనే అడ్డుకొని క్రీజు పక్కకు వెళ్లి మోరెతో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత బంతికి సింగిల్‌ తీయబోయి మళ్లీ వెనక్కి వచ్చేశాడు. ఎమోషన్‌ కంట్రోల్‌ చేసుకోలేక క్రీజులో మూడుసార్లు కప్పగంతులు వేశాడు.


వన్డేల్లో జడేజా టీ20 మోడ్‌


అజయ్‌ జడేజా! 90వ దశకంలోని కుర్రాళ్లకు ఈ పేరు బాగా పరిచయం. మిడిలార్డర్లో వచ్చి అడపా దడపా ఇన్నింగ్సులు ఆడుతుంటేవాడు. 1996 ప్రపంచకప్‌లో పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. అప్పట్లో వకార్‌ యూనిస్‌ ఎంత ప్రమాదకరంగా ఉండేవాడో అందరికీ తెలిసిందే. టీ20ల ఊసే లేని ఆ కాలంలో పాక్‌ బౌలర్లను జడేజా ఉతికారేశాడు. మహ్మద్‌ అజహరుద్దీన్‌ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు కేవలం 25 బంతుల్లో 45 రన్స్‌ కొట్టాడు. వకార్‌ ఓవర్లో ఐదు బంతుల్లోనే 23 రన్స్‌ సాధించాడు. ఆఖరి బంతికి ఔటయ్యాడు. అతడి ఫైర్‌ పవర్‌తోనే టీమ్‌ఇండియా ఆఖరి మూడు ఓవర్లలో 51 పరుగులు జోడించి స్కోరును 287-8కు తీసుకెళ్లింది.