IND vs PAK Asia Cup 2025 Final: టీమిండియా అద్భుతం చేసింది. అత్యంత ఒత్తిడి నెలకొన్న ఆసియాకప్ ఫైనల్లో 5 వికెట్లతో గ్రాండ్ విక్టరీని సాధించింది. టోర్నీలో పలుమార్లు కవ్వించిన పాక్ ఆటగాళ్లు తమదైన శైలిలో బుద్ధి చెప్పింది. అలాగే ఆసియాకప్ టోర్నీని రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి కైవసం చేసుకుంది. అలాగే దాయాదిపై ఈ టోర్నీలో హ్యాట్రిక్ విక్టరీని నమోదు చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (38 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తో మరోసారి సత్తా చాటాడు. బౌలర్లలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం చేజింగ్ లో భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. తెలుగు స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 69 నాటౌట్, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఫిఫ్టీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫహీమ్ అష్రఫ్ కు మూడు వికెట్లు దక్కాయి.
టపాటపా..చిన్న టార్గెట్ ఛేజింగ్ లో భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భీకర ఫామ్ లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (5) త్వరగా ఔటయ్యాడు. ఫోర్ కొట్టి జోరు చూపించిన శర్మ.. ఫాహిమ్ అష్రఫ్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత నిర్లక్ష్యపు షాట్ తో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (1) వికెట్ పారేసుకున్నాడు. ఆ తర్వాత కళ్లు చెదిరే ఫోర్ తో అలరించిన మరో ఓపెనర్ శుభమాన్ గిల్ (12) కూడా భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి, కాస్త కష్టాల్లో పడింది.
టీమిండియాకు విజయ తిలకమ్అత్యంత ఒత్తిడి నెలకొన్న ఫైనల్లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించాడు. తొలుత సంజూ శాంసన్ (21 బంతుల్లో 24, 2 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో స్కోరు బోర్డు కదిలింది. వేగంగా స్ట్రైక్ రొటేట్ చేయడంతోపాటు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి, రన్ రేట్ పడిపోకుండా చూశారు. నాలుగో వికెట్ కు 57 పరుగులు జోడించాక, శాంసన్ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. ఆ తర్వాత శివమ్ దూబే (22 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి తిలక్ మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కాస్త వేగంగా ఆడటంతో సాధించాల్సిన రన్ రేట్ అదుపులోకి వచ్చింది.
ముఖ్యంగా హరీస్ రవూఫ్ వేసిన ఓవర్లో 2 బౌండరీలు, సిక్సర్ తో 17 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత కుదురుగా ఆడిన ఈ జంట టార్గెట్ ను కరిగించారు. ఇక ఇన్నింగ్స్ 18వ ఓవర్ ఆఖరి బంతికి దూబే కళ్లు చెదిరే సిక్సర్ కొట్టడంతో ఇండియా డ్రైవర్ సీట్లోకి వచ్చింది. ఆ తర్వాత దూబే వెనుదిరిగిన తిలక్ చివరికంటా నిలిచి, జట్టుకు విజయాన్ని అందించాడు.