Asia Cup 2025 Ind Vs Pak Final Match Latest News: ఆసియాకప్ 2025లో భారత్ పై చేయి సాధించింది. ప్రత్యర్థి పాకిస్తాన్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. బౌలర్లు కీలకదశలో చకచకా వికెట్లు తీయడంతో ఇండియా.. తొమ్మిదో టైటిల్ ను సాధించేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ స్టన్నింగ్ ఫిఫ్టీ (38 బంతుల్లో 57, 5 ఫోర్లు, 3 సిక్సర్లు) తో మరోసారి సత్తా చాటాడు. బౌలర్లలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ కు 4 వికెట్లు దక్కాయి. నిజానికి పాక్ కు లభించిన శుభారంభానికి చివర్లో సాధించిన స్కోరుకు పొంతనే లేక పోవడం విశేషం. ఇక ఆసియాకప్ 41 ఏళ్ల చరిత్రలో దాయాది దేశాలు ఇండియా, పాక్ తొలిసారి ఫైనల్లో తలపడుతున్నాయి. ఓవరాల్ గా ఈ టోర్నీని ఎనిమిదోసారి నెగ్గిన ఇండియా, అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. పాక్ రెండుసార్లు ఈ టోర్నీని సొంతం చేసుకుంది. మ్యాచ్ లో విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 147 పరుగులను ఇండియా చేయాలి.
ఫర్హాన్ దూకుడు..ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన పాక్ కు ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్ జమాన్ (35 బంతుల్లో 46, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కని శుభారంభాన్నిచ్చారు. ముఖ్యంగా సూపర్ ఫామ్ లో ఉన్న ఫర్హాన్ తన జోరును చూపించాడు. ఇక ఆరంభంలో చక్కని వ్యూహంతో పాక్ బ్యాటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేసి, ఆ తర్వాత జోరు పెంచాలని టార్గెట్ గా నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగినట్లుగానే పవర్ ప్లేలో ఆ జట్టు నెమ్మదిగా బ్యాటింగ్ చేసింది. దాదాపు బాల్ కో రన్ చొప్పున పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓపెనర్లు జోరు కొనసాగించారు. బౌండరీలతోపాటు వేగంగా పరుగులు సాధించారు. ఈక్రమంలో 35 బంతుల్లోనే ఫర్హాన్ అర్ద సెంచరీ సాధించాడు. అయితే కాసేపటికే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో తొలి వికెట్ కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
వికెట్లు టపాటపా..తొలి వికెట్ పడిన తర్వాత పాక్ ఒక్కసారిగా ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా బౌలర్లు తెలివిగా బౌలింగ్ చేయడంతో బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ముఖ్యంగా క్రీజులో పాతుకు పోయిన ఫఖర్ వికెట్ తీయడంతో పాక్ పతనం వేగంగా సాగింది. అలాగే స్వల్ప వ్యవధిలో సయూమ్ అయూబ్ (14), వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ హరీస్ డకౌట్, కెప్టెన్ సల్మాన్ ఆఘా (8), హుస్సేన్ తలత్ (1), షాహిన్ షా ఆఫ్రిది డకౌట్ అవడంతో త్వరగా వికెట్లను కోల్పోయింది. ఒక దశలో 113-1 నుంచి 141-9తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపటికే 146 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కు రెండేసి వికెట్లు దక్కాయి.