IND vs PAK, Asia Cup 2023:  మరికొద్దిపేపట్లో పాకిస్తాన్‌తో పల్లెకెలె వేదికగా  జరుగబోయే  కీలక మ్యాచ్‌లో  భారత తుదిజట్టు ఎలా ఉండనున్నదన్న చర్చ జోరుగా సాగుతోంది. పిచ్  పరిస్థితులను బట్టి ఎవరికి ఎంపిక చేయాలన్నదానిపైనా మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు విశ్లేషణలు చేస్తున్నారు.  తాజాగా ఇదే విషయమై  టీమిండియా మాజీ ఆల్ రౌండర్  ఇర్ఫాన్ పఠాన్,  దిగ్గజ ఓపెనర్ గౌతం గంభీర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   థర్డ్ ప్లేస్‌లో కోహ్లీ వద్దని పఠాన్ అభిప్రాయపడగా  టాప్ - 4లో ఎవరు ఆడాలనేదానిపై గంభీర్  స్పందించాడు. 


తన ఫైనల్ లెవన్‌లో  ఇర్ఫాన్..  సూర్యకుమార్ యాదవ్ తో పాటు తిలక్ వర్మ కు కూడా చోటివ్వలేదు.   స్పిన్నర్ అక్షర్ పటేల్  ను కూడా పక్కనబెట్టిన  పఠాన్..  జడ్డూకు తోడుగా కుల్దీప్‌ను ఎంపిక చేశాడు.  ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేసిన  పఠాన్.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను   వన్ డౌన్‌లో దించాలని  సూచించాడు. వాస్తవానికి గడిచిన పదేండ్లుగా  టీమిండియాలో థర్డ్ ప్లేస్‌లో కోహ్లీ టన్నుల కొద్దీ పరుగులు చేశాడు.  కానీ పఠాన్ మాత్రం ఇషాన్‌ను వన్ డౌన్‌లోకి చేర్చి కోహ్లీ నాలుగో  స్థానంలోకి పంపాడు. తద్వారా  మిడిలార్డర్ మరింత బలోపేతం  అవుతుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. 


పాక్‌తో మ్యాచ్‌కు ఇర్ఫాన్ ప్లేయింగ్ లెవన్ : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా,  హార్ధిక్ పాండ్యా,  కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా,  మహ్మద్ సిరాజ్ 


 






గంభీర్ టాప్ - 4 ఇదే.. 


పటిష్టమైన పాకిస్తాన్ పేస్ దళాన్ని  ధీటుగా ఎదురుకోవడానికి  భారత జట్టు టాపార్డర్ కీలక పాత్ర పోషించనుంది.   షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా,  హరీస్ రౌఫ్‌లను ఎదుర్కోవడానికి భారత్ టాపార్డర్ అంతే పటిష్టంగా ఉండాలని  అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో  రోహిత్ ఓపెనర్‌గా తప్పుకుని  నాలుగో స్థానంలో రావాలని.. ఇషాన్ కిషన్ - శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ చేయాలని గంభీర్  సూచించాడు. వన్ డౌన్‌లో  కోహ్లీ, ఫోర్త్ ప్లేస్ ‌లో రోహిత్ శర్మ ఆడితే ఆ తర్వాత వచ్చే శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యాలకూ మంచి పునాది పడుతుందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. 


శుభ్‌‌మన్ గిల్ 
ఇషాన్ కిషన్ 
విరాట్ కోహ్లీ 
రోహిత్ శర్మ 






మ్యాచ్‌ వివరాలు.. 


- శనివారం మధ్యాహ్నం 3 గంటలకు  క్యాండీలోని పల్లెకెలె వేదికగా  మ్యాచ్ జరుగనుంది. 


లైవ్ చూడటం ఎలా..? 


- ఈ మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించాలంటే  టెలివిజన్ ‌లో అయితే స్టార్ నెట్వర్క్   హిందీ, ఇంగ్లీష్‌తో  పాటు స్థానిక  భాషలలోని తన ఛానెళ్లలో కూడా ప్రసారం చేస్తున్నది.  


- మొబైల్స్‌లో అయితే  డిస్నీ హాట్ స్టార్ యాప్‌లో  ఉచితంగానే వీక్షించొచ్చు. 

















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial