Sanju Samson: 'సంజూ శాంసన్‌'లా ఉండటం చాలా కష్టమని అభిమానులు అంటున్నారు. టీ20 క్రికెట్‌ మ్యాచుల్లో అతడికి చోటివ్వకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఎన్నాళ్లిలా రిజర్వు బెంచీ పైనే కూర్చోబెడతారని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో అతడికి అవకాశం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.




రెండేళ్లుగా సంజూ శాంసన్‌ నిలకడగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. భారత్‌-ఏ తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. గతంతో పోలిస్తే ఊరికే వికెట్ ఇవ్వడం లేదు. మరింత జాగ్రత్తగా ఆడుతున్నాడు. రిషభ్ పంత్‌ కన్నా బాధ్యతాయుతంగా ఆడుతున్నప్పటికీ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో అతడికి చోటివ్వలేదు. ప్రస్తుతం దినేశ్ కార్తీక్ కథ ముగిసింది. దాంతో న్యూజిలాండ్ సిరీసులో సంజూను ఎంపిక చేశారు.




ఈ సిరీసులో మొదటి టీ20 వర్షార్పణం అయింది. రెండో మ్యాచులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. అయితే తుది పదకొండు మందిలో సంజూకు చోటు దొరకలేదు. ఇక మూడో పోరులోనైనా ఆడిస్తారేమోనని ఫ్యాన్స్‌ అంచనా వేశారు. కానీ ఒకే మార్పు చేశారు. వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో హర్షల్‌ పటేల్‌ను తీసుకున్నారు. ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్‌ సంజూను ఆడినవ్వరా అంటూ ఫైర్‌ అవుతున్నారు. ట్విటర్లో ట్రెండ్‌ చేస్తున్నారు.




'సంజూ శాంసన్‌ ప్రతిభకు ఇది అన్యాయమే! సెలక్టర్లు ప్రస్తుత ఫామ్‌ను పట్టించుకోకుండా పదేపదే అతడిని బెంచ్‌పై కూర్చోబెడుతున్నారు' అని ఓ అభిమాని ట్వీట్‌ చేశారు. 'పునరాగమనం మ్యాచులో సంజూ 42 బంతుల్లోనే 77 రన్స్‌ చేశారు. అతడి స్థానాన్ని 6కు మార్చారు. అయినప్పటికీ 2022లో అతడి సగటు 44, స్ట్రైక్‌రేట్‌ 158గా ఉంది. ఒక టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఆడటం అంత సులువు కాదు. అయినా తుది జట్టులో చోటివ్వడం లేదు' అని మరోకరు పోస్టు చేశారు.