Ashwin Defend Dravid: టీమ్‌ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. న్యూజిలాండ్ టూర్ నుంచి అతడు విశ్రాంతి తీసుకోవడం సరైందేనని పేర్కొన్నాడు. విరామం లేకుండా పనిచేస్తున్నప్పుడు ఎవ్వరైనా మానసికంగా, శారీకంగా అలసిపోతారని వెల్లడించాడు. కోచ్‌లకు ఐపీఎల్ సమయంలో దొరికే విశ్రాంతి సమయం సరిపోతుందన్న రవిశాస్త్రి వ్యాఖ్యలకు యాష్ కౌంటర్ ఇచ్చాడు.
రాహుల్ ద్రవిడ్ విరామం తీసుకోవడంతో న్యూజిలాండ్ టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహ్మద్ షమి, అశ్విన్, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేని జట్టును నడిపించనున్నాడు. కాగా కోచ్‌లు విశ్రాంతి తీసుకోవడాన్ని తాను నమ్మనని మాజీ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
'నేను విరామాలను విశ్వసించను. ఎందుకంటే నేను నా జట్టు, ఆటగాళ్లను పూర్తిగా అర్థం చేసుకోవాలని భావిస్తాను. వారంతా నియంత్రణలో ఉండాలని కోరుకుంటాను. ఇన్నిసార్లు విరామం తీసుకోవాల్సి అవసరం ఏముంది? ఐపీఎల్ సమయంలో 2, 3 నెలలు విరామం దొరుకుతుంది. కోచ్‌కు అది సరిపోతుంది. మిగతా సమయాల్లో ఏమైనా సరే జట్టుతోనే ఉండాలి' అని శాస్త్రి అన్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022 కోసం టీమ్‌ఇండియా విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడిందని అశ్విన్ అంటున్నాడు. 'పూర్తి భిన్నమైన జట్టుతో వీవీఎస్ లక్ష్మణ్ న్యూజిలాండ్‌కు ఎందుకెళ్లాడో నేను వివరిస్తా. ఎందుకంటే దానినీ మరో కోణంలో చూస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు రాహుల్ ద్రవిడ్ జట్టు విపరీతంగా శ్రమించింది. ప్లానింగ్ నుంచి చివరి వరకు నేనంతా గమనించాను. అందుకే ఇదంతా చెబుతున్నా. ప్రతి వేదిక, ప్రత్యర్థి జట్టుకోసం ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. ఇది శారీరకంగానే కాదు మానసికంగా అలసటకు దారితీస్తుంది. అందరికీ విరామం అవసరం. కివీస్ సిరీస్ అవ్వగానే మాకు బంగ్లా పర్యటన ఉంది. ఈ కారణంతోనే లక్ష్మణ్ నేతృత్వంలోని జట్టు కివీస్ వెళ్లింది' అని అశ్విన్ వివరించాడు.