IND vs NZ Final: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టైటిల్‌కు కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. దుబాయ్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఐసీసీ టోర్నమెంట్‌లో టీమిండియా 14వసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది. ఇప్పుడు పాతికేళ్ల లెక్కను సరి చేసే సమయం వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు.  

1983లో టీం ఇండియా తొలిసారి ఐసీసీ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడింది. అప్పుడు ఆడిన  వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో ఓడించింది. ఆ విజయంతో తొలిసారి ప్రపంచకపప్‌ గెలుసుకుందిటీమిండియా. దీని తర్వాత టీం ఇండియా 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ఇండియా,  న్యూజిలాండ్ మధ్య జరిగింది. న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఎగరేసుకుపోయింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత టీంఇండియాకు న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది.

Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ ఆడతాడా లేదా? గాయంపై లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?

రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా  2002లో భారత జట్టు మూడోసారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్ భారత్‌, శ్రీలంక మధ్య జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. దీని తర్వాత టీం ఇండియా 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక్కడ, ఆస్ట్రేలియా చేతిలో 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్.

ధోనీ కెప్టెన్సీలో టీ20, వన్డే ప్రపంచ కప్‌లు కైవశం  2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. పాకిస్తాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. టీమిండియా 2011లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడింది. ఫైనల్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు.

వరుస పరాజయాల తర్వాత...2014 టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో భారత్ ఫైనల్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీని తర్వాత, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. 2019-21 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీం ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. దీని తర్వాత 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీం ఇండియా ఓడిపోయింది. ఇలా వరుస ఓటములతో ఉన్న టీమిండియా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ గెలుచుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీపై కన్నేసింది. 

Also Read: టీమిండియా ప్లేయింగ్ లెవ‌న్ ఇదే..! జ‌ట్టులో ఒక్క మార్పు త‌ప్ప‌దా..? బ్యాటింగ్ మ‌రింత బలోపేతం