IND Vs NZ, 3rd T20I: ఐసీసీ టీ20 ప్రపంచకప్ వైఫల్యం తర్వాత భారత్ తొలి సిరీస్ కైవసం చేసుకుంది. న్యూజిలాండ్‌పై మూడు టీ20ల సిరీసును 1-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ సాంతం వరుణుడు ఇబ్బందులు కలిగించాడు. వర్షంతో తొలి మ్యాచ్ రద్దవ్వగా రెండో దాంట్లో టీమ్‌ఇండియా విజయ దుందుభి మోగించింది. ఇక మంగళవారం జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది.
లక్కీగా ఎస్కేప్!
కివీస్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో 9 ఓవర్లకు టీమ్‌ఇండియా 75/4తో ముగిసింది. అప్పుడే వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం స్కోరు సమమైంది. ఎంతకీ వరుణుడు కరుణించకపోవడంతో ఫలితం టైగా మారింది. హార్దిక్ పాండ్య (30*; 18 బంతుల్లో 3x4, 1x6) దూకుడుగా ఆడాడు. ఇషాన్ కిషన్ (10), రిషభ్ పంత్ (11) సూర్యకుమార్ (13) ఫర్వాలేదనిపించారు. శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. వర్ష సూచన ఉండటంతో భారత్ దూకుడుగా ఆడుతూ త్వరగా వికెట్లు ఛేజార్చుకుంది. అంతకు ముందు కివీస్‌లో డేవాన్ కాన్వే (59; 49 బంతుల్లో 5x4, 2x6), గ్లెన్ ఫిలిప్స్ (54; 33 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఈ భాగస్వామ్యం అదుర్స్!
వర్షం కురవడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 9 వద్దే ఫిన్ అలెన్ (3)ను అర్షదీప్ ఎల్బీ చేశాడు. స్వల్ప స్కోరుకే మార్క్ చాప్‌మన్ (12)ను సిరాజ్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన డేవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ నిలకడగా ఆడి ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. చక్కని బంతుల్ని డిఫెండ్ చేస్తూనే చెత్త బంతుల్ని వేటాడారు. 15 ఓవర్ల వరకు అసలు వికెట్టే ఇవ్వలేదు.
అర్షదీప్, సిరాజ్ కిర్రాక్ బౌలింగ్
కాన్వే 39, ఫిలిప్స్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాదేసి మూడో వికెట్‌కు 63 బంతుల్లో 86 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రమాదకరంగా మారిన ఫిలిప్స్‌ను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ విడదీశాడు. అప్పటికి స్కోరు 130. ఆ తర్వాతి ఓవర్లోనే 146 వద్ద కాన్వేను అర్షదీప్ ఔట్ చేశాడు. 147 వద్ద నీషమ్ (0), 149 వద్ద శాంట్నర్ (1), మిచెల్ (10), సోది (0), మిల్నె (0) పెవిలియన్ చేరారు. 19.4వ బంతికి సౌథీ (6) హర్షల్ పటేల్ బౌల్డ్ చేయడంతో 160కి కివీస్ కథ ముగిసింది.