India vs New Zealand 1st Test | బెంగళూరు: న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా పోరాడి ఓడింది. ప్రత్యర్థి కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నిర్దేశించిన 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ జట్టు 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జడేజా బౌలింగ్ లో యంగ్ ఫోర్ కొట్టడంతో కివీస్ ఆటగాళ్ల సంబరాల్లో మునిగిపోయారు. కాగా, భారత గడ్డపై న్యూజిలాండ్ కు ఇది మూడో టెస్టు విజయం. విల్ యంగ్ (48 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 నాటౌట్) రాణించారు. టెస్ట్ సిరీస్ లో 1-0తో కివీస్ ఆధిక్యం సాధించింది.


వరుణుడు భారత్ ను ఆదుకుంటాడని వాతావరణ సూచన చూసిన క్రికెట్ ప్రేమికులు ఆశపడ్డారు. కానీ స్వల్ప స్కోరు కావడంతో టార్గెట్ ను కేవలం 2 వికెట్లు కోల్పోయిన కివీస్ ఛేదించింది. 20 ఏళ్ల కిందట ముంబైలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు చేసిన మ్యాజిక్ ఇక్కడ రిపీట్ చేసి చరిత్ర తిరగరాస్తారా అని ఆశించిన ప్రేక్షకులకు అది అత్యాశే అనితేలిపోయింది. పటిష్ట ఆస్ట్రేలియా, ఎదురులేని ఆస్ట్రేలియా జట్టును స్పిన్నర్లు నిలువరించడంతో ఇదే టార్గెట్ ను రెండు దశాబ్దాల కిందట భారత్ డిఫెండ్ చేసుకుంది. నేడు అలాంటి పరిస్థితి కనిపించలేదు. తొలి ఇన్నింగ్స్ లో దారుణవైఫల్యమే భారత్ తొలి టెస్ట్ ఓటమికి కారణమని చెప్పవచ్చు. 






36 ఏళ్ల తరువాత భారత గడ్డమీద కివీస్ టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించింది. చివరగా 1988లో న్యూజిలాండ్ టీమ్ భారత్ పై మన గడ్డపై విజయం సాధించింది. ఓవరాల్ గా భారత్ లో కివిస్ కు ఇది మూడో టెస్టు విజయం మాత్రమే. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో సైతం తొలి టెస్టులో భారత్ ఓడింది. ఆ తరువాత భారత్ కు మరో టెస్టులో ఓటమిపాలైంది. 


బ్యాటర్ల దారుణ వైఫల్యంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌటైంది. మరోవైపు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 402 పరుగులు చేసింది. దాంతో కివీస్ కు 356 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ పుంజుకున్నా ప్రయోజనం లేకపోయింది. రోహిత్ శర్మ (52), విరాట్ కోహ్లీ (70) హాఫ్ సెంచరీలు చేయగా.. రిషబ్ పంత్ (99) ఒక్క పరుగుతు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. కెరీర్ లో నాల్గో టెస్టు ఆడుతున్న యువ సంచలన సర్ఫరాజ్ ఖాన్ తొలి శతకం నమోదు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో తనకు ఇది తొలి సెంచరీ. భారత్ భారీ స్కోరు దిశగా వెళ్తుంది అనుకున్న క్రమంలో సర్ఫరాజ్ ఔటయ్యాడు. ఆపై ఇన్ సైడ్ ఎడ్జ్ తో పంత్ పెవిలియన్ చేరాడు. భారత్ చివరి 7 వికెట్లను 50 పరుగుల వ్యవధిలో కోల్పోవడం సైతం కొంపముంచింది. మరో 70, 80 రన్స్ చేసి ఉంటే భారత బౌలర్లకు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. 


నేడు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెంటనే కివీస్ కు బుమ్రా షాకిచ్చాడు. కివీస్ ఓపెనర్ టాప్ లాథమ్ ను డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ కాన్వె (17)ను సైతం ఎల్బీ రూపంలో బుమ్రానే ఔట్ చేశాడు. మరో వికెట్ పడకుండా యంగ్ (48 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 నాటౌట్) జాగ్రత్తగా ఆడారు. అయితే టార్గెట్ మరి చిన్నది కావడంతో 27.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కివీస్ విజయాన్ని అందుంది.