భారత్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ పోరాడదగ్గ స్కోరు చేసింది. వర్షం కారణంగా 12 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టపోయి 108 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (64 నాటౌట్: 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత్ విజయానికి 72 బంతుల్లో 109 పరుగులు కావాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. పవర్‌ప్లే నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (4: 5 బంతుల్లో, ఒక ఫోర్), ఆండ్రూ బాల్‌బిర్నీ (0: 2 బంతుల్లో), వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ గ్యారెత్ డెలానీల (8: 9 బంతుల్లో, ఒక ఫోర్) వికెట్లను ఐర్లండ్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 22 పరుగులు మాత్రమే. స్టిర్లింగ్‌ను హార్దిక్ పాండ్యా, బిల్‌బిర్నీని భువనేశ్వర్, గ్యారెత్‌ను అవేష్ ఖాన్ అవుట్ చేశారు.


ఈ దశలో హ్యారీ టెక్టర్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లు ఆడుతూ స్కోరును ముందుకు నడిపించాడు. మరో ఎండ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లొర్కాన్ టక్కర్ (18: 16 బంతుల్లో, రెండు సిక్సర్లు) వికెట్ కాపాడినా అవసరమైనంత వేగంగా ఆడలేకపోయాడు. టక్కర్ కూడా వేగంగా ఆడితే ఐర్లాండ్ మరింత భారీ స్కోరు చేసేది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. చివర్లో జార్జ్ డాక్రెల్ (4 నాటౌట్: 7 బంతుల్లో) కూడా అవసరం అయినంత వేగంగా ఆడలేకపోయాడు. దీంతో ఐర్లాండ్ 12 ఓవర్లలో నాలుగు వికెట్లకు 108 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.