Sarfaraz Khan slams maiden Test half century: దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్నా జట్టులో చోటు కల్పించడం లేదని అభిమానుల ఆవేదన, మైదానంలో అగ్రెసీవ్‌గా ఉంటాడు కాబట్టే భారత జట్టులో చోటు దక్కడం లేదని ఊహాగానాలు. టెస్ట్‌ జట్టు ప్రకటించే ప్రతీసారి.. ఈసారి జట్టులో చోటు పక్కా అనే వార్తలు. అసలు జట్టులోకి వస్తే రాణిస్తాడా... లేక చాలామంది ఆటగాళ్లలాగే అంచనాలు అందుకోలేక చతికిల పడతాడా అని... వీటన్నింటికి ఒకే ఇన్నింగ్స్‌తో సర్ఫరాజ్‌ ఖాన్‌( Sarfaraz Khan) సమాధానం చెప్పేశాడు. వన్డే తరహా ఆటతో ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అర్ధ శతకంతో సత్తా చాటాడు. తన ఎంపిక సరైందేనని... తనలో అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లో రాణించే సత్తా ఉందని సర్ఫరాజ్ నిరూపించుకున్నాడు. అంతేనా తొలి మ్యాచ్‌లోనే అర్ధ శతకం సాధించి రికార్డు కూడా సృష్టించాడు. 

 

సాధికార బ్యాటింగ్‌

క్రీజులోకి వచ్చినప్పటి  నుంచి సర్ఫరాజ్‌ ఖాన్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడుతున్నాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్‌ సింగిల్‌ కోసం యత్నించి రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు.

 

మ్యాచ్‌ సాగుతుందిలా..?

టీమిండియా సారధి రోహిత్‌ శర్మ, లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్‌, రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  దురదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ రనౌట్‌ అయినా... సాధికార బ్యాటింగ్‌తో తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు.  157 బంతుల్లో రోహిత్‌ శర్మ శతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది పదకొండో సెంచరీ కావడం గమనార్హం. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ 131 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రోహిత్‌- జడేజా 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. . 198 బంతుల్లో రవీంద్ర జడేజా సెంచరీ చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు.