Root vs Bradman: ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్.. నాలుగో టెస్టులో ఇండియాపై అద్బుత సెంచరీ (248 బంతుల్లో 150,14 ఫోర్లు) చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెంచరీ ద్వారా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియా దిగ్గజం డాన బ్రాడ్ మన్ నెలకొల్పిన ఒక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో సొంతగడ్డపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును బ్రాడ్ మన్ పేరిట ఉంది. అతను ఇంగ్లాండ్ పై సొంతగడ్డపై ఎనిమిది సెంచరీలు చేసి ఈ రికార్డు నమోదు చేశాడు. మూడో టెస్టులో సెంచరీతో ఈ రికార్డును రూట్ సమం చేశాడు. ఆ మ్యాచ్ లో 104 పరుగులను రూట్ చేశాడు. తాజాగా తనకెంతో అచ్చొచ్చిన వేదికైన మాంచెస్టర్లో మరో సెంచరీతో బ్రాడ్ మన్ రికార్డును బద్దలు కొట్టాడు. దీంతో సొంతగడ్డపై ఒక ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీలు (9) చేసిన ప్లేయర్ గా ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అలాగే ఇండియాపై అత్యధిక సెంచరీలు చేసిన స్టీవ్ స్మిత్ (11) రికార్డును కూడా రూట్ ఈ మ్యాచ్ ద్వారా బద్దలు కొట్టాడు. తన ఖాతాలో 12 సెంచరీలు ఉన్నాయి.
టాప్-2లోకి..ఈ మ్యాచ్ లోనే మరో అరుదైన ఘనతను రూట్ తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో తాను రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్ కు ముందు 13,259 పరుగులతో టాప్ -లో ఉన్న రూట్.. నెమ్మదిగా రాహుల్ ద్రవిడ్ (13,288), జాక్ కలిస్ (13,289)లను దాటి, కాసేపటికి రెండో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (13, 378)ను కూడా దాటాడు. రూట్ ఈ మార్కును దాటినప్పుడు, కామేంటరీలోనే ఉన్న పాంటింగ్ అతడిని ప్రశంసించాడు. ఇక ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15, 921) మాత్రమే ముందున్నాడు. జో రూట్ తన 157వ టెస్టులో ఈ ఘనత సాధించాడు.
నాలుగో స్థానంలోకి..ఇక తాజా మ్యాచ్ లో తన కెరీర్ లో 38వ సెంచరీని రూట్ పూర్తి చేసుకున్నాడు. దీంతో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో తను నాలుగో స్తానానికి ఎగబాకాడు. ప్రస్తుతం శ్రీలంక గ్రేట్ కుమార సంగక్కరతో కలిసి నాలుగో స్తానంలో ఉన్నాడు. అతని కంటే ముందర సచిన్ టెండూల్కర్ (51 సెంచరీలు), జాక్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41) మాత్రమే ముందున్నారు. ఇక నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 358 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సరికి 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.