Ind Vs Eng Manchestar Test Latest Live Updates: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ పట్టు బిగించింది. బ్యాటర్లు రాణించడంతో శుక్రవారం ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఆట ముగిసే సరికి 135 ఓవర్లలో 7 వికెట్లకు 544 పరుగులు చేసింది. ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెటరన్ బ్యాటర్ జో రూట్ (248 బంతుల్లో 150,14 ఫోర్లు) రికార్డు సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. క్రీజులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (134 బంతుల్లో 77 బ్యాటింగ్, 6 ఫోర్లు), లియామ్ డాసన్ (21 బ్యాటింగ్) ఉన్నారు. మ్యాచ్ కు మరో రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లాండ్ భారీ ఆధిక్యం సాధించడంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం సాగిస్తుందనే చెప్పుకోవచ్చు.
భారీ భాగస్వామ్యాలు..ఓవర్ నైట్ స్కోరు 225/2 తో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఇంగ్లాండ్ భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా జో రూట్, ఒల్లీ పోప్ (71) తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ఆరంభం నుంచే మంచి సమన్వయంతో ఆడుతూ, వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. ఇదే క్రమంలో ఇద్దరు అర్ద సెంచరీలు చేసుకున్నారు. వందకు పైగా పరుగులు జోడించి, లంచ్ విరామానికి మరో వికెట్ పడకుండా చూశారు. లంచ్ తర్వాత ఇంగ్లాండ్ త్వరగా రెండు వికెట్లను కోల్పోయింది. ముందుగా పోప్ ను ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేసి, బ్రేకిచ్చాడు. ఆ తర్వాత హేరీ బ్రూక్ (3) ను కూడా ఔట్ చేసి ఇండియాను మ్యాచ్ లోకి తెచ్చే ప్రయత్నం చేశాడు.
రికార్డు సెంచరీ..మరోవైపు జోరుగా పరుగులు సాధిస్తూ, టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించి, టాప్-4లో ఉన్న రాహుల్ ద్రవిడ్, జాక్ కలిస్, రికీ పాంటింగ్ లను రూట్ అధిగమించాడు. ఇదే జోరులో ఈ సిరీస్ లో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఎండ్ లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 150 పరుగులు జోడించారు. అలాగే రూట్ 150 పరుగుల మార్కును కూడా చేరుకుని, ఆ తర్వాత ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జేమీ స్మిత్ (9) విఫలం కాగా, క్రిస్ వోక్స్ (4)ను మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆఖర్లో స్టోక్స్, డాసన్ జంట మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. నాలుగో రోజు వీలైనన్నీ ఎక్కువ పరుగులు జోడించి, భారీ ఆధిక్యాన్ని దక్కించుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.