Manchestar Test Latest Updates: ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టుపై ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసి, భారీ ఆధిక్యాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం నాలుగోరోజు 157.1 ఓవర్లలో 669 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ సూపర్ సెంచరీ (198 బంతుల్లో 141, 11 ఫోర్లు, 3 సిక్సర్లు)తో నాలుగోరోజు సెంచరీ పూర్తి చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. దీంతో భారత్ పై 311 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు రెండో ఇన్నింగ్స లో భారీ షాక్ తగిలింది. పరుగులేమీ చేయకుండానే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ పెవలియన్ కు వెనుదిరిగారు. లంచ్ విరామానికి భారత్ 3 ఓవర్లలో 2 వికెట్లకు 1 పరుగు చేసింది. ఇంకా 310 పరగుల వెనుకంజలో ఇండియా నిలిచింది. క్రిస్ వోక్స్ కు రెండు వికెట్లు దక్కాయి.
స్టోక్స్ షో..ఓవర్ నైట్ స్కోరు 544/7 తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు సాధించింది. ముఖ్యంగా బెన్ స్టోక్స్ సింహభాగం పరుగులు సాధించి, జట్టు భారీ ఆధిక్యం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. మైదనాం నలువైపులా బౌండరీలు సాధిస్తూ, జోరు కొనసాగించాడు. ఆ తర్వాత కాసేపటికి లియామ్ డాసన్ (26) ను జస్ ప్రీత్ బుమ్రా బౌల్డ్ చేశాడు. అయితే మరో ఎండ్ లో బ్రైడెన్ కార్స్ (47) కూడా స్టోక్స్ కు చక్కని సహకారం అందించాడు. ఈ క్రమంలో స్టోక్స్ రెండేళ్ల తర్వాత సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొమ్మిదో వికెట్ కు 96 పరుగులు జోడించారు. ఆఖర్లో స్టోక్స్ తో పాటు, కార్స్ ను జడేజా ఔట్ చేసి, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. మిగతా బౌలర్లలో బుమ్రా, వాషింగ్టన్ సుందర్ కు రెండేసి వికెట్లు దక్కాయి.
హార్రర్ షో..311 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ తో ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫస్ట్ ఓవర్లోనే యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ డకౌట్ అయ్యారు. క్రిస్ వోక్స్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని ఎదుర్కొన్న జైస్వాల్.. స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. జో రూట్.. క్యాచ్ పట్టడంలో కాస్త తడబడినా, ఆఖరికి క్యాచ్ ను పూర్తి చేశాడు. ఆ తర్వాతి బంతికే సాయి సుదర్శన్.. ఔటయ్యాడు. ఆఫ్ స్టంప్ కు కాస్త దూరంలో వచ్చిన బంతిని ఆడటమా..? వదిలేయడమా..? అన్న మీమాంసలో బ్యాట్ ను కాస్త పైకి లేపాడు. అయితే బంతి ఎడ్జ్ తీసుకుని బ్రూక్ చేతిలో పడింది. దీంతో పరుగులేమీ చేయకుండానే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ (1 బ్యాటింగ్) సింగిల్ తీయడంతో భారత్ ఇన్నింగ్స్ ఖాతా తెరిచింది.