ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ చరిత్ర సృష్టించాడు. 5వ టెస్ట్ నాల్గవ రోజున, మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో 1000 కంటే ఎక్కువ బంతులు వేయడం ద్వారా అతను ప్రత్యేక జాబితాలో చేరాడు. మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 సంవత్సరాల కిందట ఒక టెస్ట్ సిరీస్‌లో 1000 కంటే ఎక్కువ బాల్స్ బౌలింగ్ చేసిన చివరి భారతీయ బౌలర్.
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ నాల్గవ రోజు ప్రారంభమైనప్పుడు, భారత్ మంచి స్థితిలో ఉంది. కానీ హ్యారీ బ్రూక్ (111), జో రూట్ (105) సెంచరీలతో భారత జట్టుకు బిగ్ షాకిచ్చారు. వారి ఆటతో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడంతో మ్యాచ్ లో ఉత్కంఠ నెలకొంది. కాని మూడవ సెషన్‌లో వర్షం కారణంగా ఆట నిలిపివేశారు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ దాటికి ఇంగ్లాండ్ చివరి 7 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసింది. ప్రసిద్ కృష్ణ బౌలింగ్ లో రూట్, జాకబ్ బెథెల్ ఔటయ్యారు.
తాజాగా జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచిన సిరాజ్ పై జో రూట్ ప్రశంసల జల్లులు కురిపించాడు. సిరాజ్ జట్టు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని రూట్ వ్యాఖ్యానించాడు.
1000 కంటే ఎక్కువ బంతులు వేసిన సిరాజ్
ఇప్పటివరకు మహ్మద్ సిరాజ్ టెస్ట్ సిరీస్ 5 మ్యాచ్‌లలో 1088 బంతులు వేశాడు. అతను 36.85 సగటుతో బౌలింగ్ చేస్తూ 737 పరుగులు ఇచ్చాడు. సిరీస్ లో సిరాజ్ 20 వికెట్లు తీశాడు. నేడు 5వ టెస్ట్ చివరి రోజు ఆట మిగిలి ఉంది. సిరాజ్ ఒక టెస్ట్‌లో 1000 బంతులు వేసిన తొలి భారత బౌలర్ కాదు, అతని ముందు 27 సార్లు ఈ ఫీట్ నమోదైంది. చివరగా జస్ప్రీత్ బుమ్రా 2021లో ఇంగ్లాండ్‌తోనే ఈ ఫీట్ నమోదు చేశాడు.
చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్
మహ్మద్ సిరాజ్ ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 20 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన జస్ప్రీత్ బుమ్రా తరువాత 2వ భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌లో ఒక టెస్ట్‌లో అత్యధిక వికెట్లు రికార్డ్ బుమ్రా పేరిట ఉంది. బుమ్రా 2021లో జరిగిన టెస్ట్ సిరీస్ లో 23 వికెట్లు తీశాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 5వ టెస్ట్ నేడు చివరి రోజు
వర్షం అంతరాయం కలిగించకపోతే, భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ ఫలితం మొదటి సెషన్‌లో వస్తుంది. ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం 35 పరుగులు మాత్రమే కావాలి, భారత్ నెగ్గాలంటే మరో 4 వికెట్లు పడగొట్టాలి. కాని ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి స్మిత్ ఒక్కడే బ్యాటర్ ఉన్నాడు. క్రిస్ వోక్స్ గాయపడి కట్టుతో ఉన్నాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నాల్గవ రోజు చివరి సెషన్‌లో బాగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్ మీద ఒత్తిడి పెంచారు. దాంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.