గతేడాది ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడాల్సిన ఐదు టెస్టులో సిరీస్‌లో చివరి మ్యాచ్ జులై 1వ తేదీకి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడటానికి మయాంక్ అగర్వాల్ ఇంగ్లండ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మయాంక్ అగర్వాల్ ఫొటో ద్వారా షేర్ చేశాడు.


భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ రావడంతో తన స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు అవకాశం దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. మార్చిలో మనదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో మయాంక్ చివరిసారిగా ఆడాడు. అక్కడ తను 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు.


రోహిత్ కరోనావైరస్ నుంచి కోలుకుంటున్నాడు. దీంతోపాటు కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా వెనుదిరిగాడు. దీంతో టీమిండియాకు ఓపెనింగ్ ఆప్షన్లు తక్కువయ్యాయి. శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసేవారు లేకపోవడంతో మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖాయమే అనుకోవచ్చు.


మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో బీసీసీఐ సైలెంట్‌గా మయాంక్‌ను ఇంగ్లండ్ పంపింది. ఒకవేళ ఈలోపు రోహిత్ సెట్టయితే తను మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు. నెగిటివ్ రాకుంటే మాత్రం మయాంక్‌కు చాన్స్ దక్కవచ్చు.


ఒకవేళ రోహిత్‌కు నెగిటివ్ రాకుంటే భారత్ ముందు రెండు ప్రశ్నలున్నాయి? గిల్‌తో ఇన్నింగ్స్ ఎవరు ఓపెన్ చేస్తారు? మ్యాచ్‌కు కెప్టెన్సీ ఎవరు నిర్వర్తిస్తారు? రోహిత్‌తో పాటు రాహుల్ కూడా గాయపడటంతో కెప్టెన్సీ సమస్య కూడా తలెత్తింది. రిషబ్ పంత్, జస్‌ప్రీత్ బుమ్రాలు ప్రస్తుతం రేసులో ముందున్నారు.


అయితే కీలక మ్యాచ్ కాబట్టి విరాట్ కోహ్లీకి తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు అందించే అవకాశం కూడా లేకపోలేదు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచినా, డ్రా చేసుకున్నా టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ డ్రాగా ముగియనుంది.