ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా మెల్లగా పట్టు బిగిస్తుంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. చతేశ్వర్ పుజారా (17 బ్యాటింగ్: 39 బంతుల్లో, రెండు ఫోర్లు), హనుమ విహారి (10 బ్యాటింగ్: 37 బంతుల్లో, ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. దీంతో టీమిండియా మొత్తం ఆధిక్యం 169 పరుగులకు చేరుకుంది.
132 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడో బంతికే ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను అవుట్ చేసి అండర్సన్ టీమిండియాను తొలి దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత హనుమ విహారి, పుజారా కలిసి మరో వికెట్ పడకుండా సెషన్ ముగించారు.
ప్రస్తుతానికి టీమిండియా 169 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మన్ 300 పరుగులు చేసినా మొత్తం ఆధిక్యం 442 పరుగులకు చేరుతుంది. అది ఇంగ్లండ్‌కు కచ్చితంగా భారీ లక్ష్యమే. కాబట్టి రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 300 పరుగులు చేయడాన్ని టీమిండియా లక్ష్యంగా పెట్టుకోవాలి. దాన్ని కూడా వేగంగా చేరుకోవాలి. ప్రస్తుతానికి ఇంకా ఏడు సెషన్ల ఆట మిగిలి ఉంది. నాలుగో రోజు లంచ్ సమయానికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తే ఐదు సెషన్లలో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంపై ఆశలు పెట్టుకోవచ్చు.