ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. మొదటి రోజు ఆట సమయానికి 73 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. మహ్మద్ షమీ (0 బ్యాటింగ్: 11 బంతుల్లో), రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్: 163 బంతుల్లో, 10 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రిషబ్ పంత్ (146: 111 బంతుల్లో, 20 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) సెంచరీ సాధించాడు.


వర్షం అంతరాయం కలిగించడంతో మొదటి రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం అయింది. దీనికి తోడు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (17: 24 బంతుల్లో, నాలుగు ఫోర్లు), ఛతేశ్వర్ పుజారా (13: 46 బంతుల్లో, రెండు ఫోర్లు) 46 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. దీంతో లంచ్ సమయానికి టీమిండియా 53 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది.


 లంచ్ బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. హనుమ విహారి (20: 53 బంతుల్లో, ఒక ఫోర్), విరాట్ కోహ్లీ (11: 19 బంతుల్లో, రెండు ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (15: 11 బంతుల్లో, మూడు ఫోర్లు) ముగ్గురూ పరుగులు చేయడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫాం లేమి కొనసాగుతూనే ఉంది. దీంతో టీమిండియా 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా టీమిండియాను ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు అభేద్యంగా 76 పరుగులు జోడించారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి మరో వికెట్ కోల్పోకుండా 174 పరుగుల స్కోరును చేరుకుంది.


టీ బ్రేక్ నుంచి తిరిగి వచ్చాక పంత్ చెలరేగి ఆడాడు. టీ20 స్థాయిలో చెలరేగి ఆడటంతో స్కోరు పరుగులు పెట్టింది. ఈ దశలోనే రిషబ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసియా వెలుపల పంత్‌కు ఇది నాలుగో శతకం. ఇప్పటివరకు ఏ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఆసియా వెలుపల ఒకటి కంటే ఎక్కువ సెంచరీ సాధించలేదు. కానీ పంత్ కెరీర్ ప్రారంభంలోనే నాలుగు సాధించడం విశేషం.


ఆరో వికెట్‌కు 222 పరుగులు జోడించిన అనంతరం జో రూట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రిషబ్ పంత్ అవుటయ్యాడు. ఆ వెంటనే శార్దూల్ ఠాకూర్ (1: 12 బంతుల్లో) కూడా అవుట్ కావడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత షమీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో మొదటిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా ఏడు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్‌కు మూడు వికెట్లు దక్కగా... మ్యాటీ పాట్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు.  బెన్ స్టోక్స్, జో రూట్‌లు చెరో వికెట్ పడగొట్టారు.