ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా పోరాడుతుంది. మొదటి రోజు టీ బ్రేక్ సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (53 బ్యాటింగ్: 52 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), రవీంద్ర జడేజా (32 బ్యాటింగ్: 65 బంతుల్లో, నాలుగు ఫోర్లు) క్రీజులో ఉన్నారు.


53-2 స్కోరుతో లంచ్ బ్రేక్ నుంచి తిరిగి వచ్చిన టీమిండియా వరుస వికెట్లు కోల్పోయింది. హనుమ విహారి (20: 53 బంతుల్లో, ఒక ఫోర్), విరాట్ కోహ్లీ (11: 19 బంతుల్లో, రెండు ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (15: 11 బంతుల్లో, మూడు ఫోర్లు) ముగ్గురూ పరుగులు చేయడంలో విఫలం అయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫాం లేమి కొనసాగుతూనే ఉంది. దీంతో టీమిండియా 98 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.


ఈ దశలో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా టీమిండియాను ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు అభేద్యంగా 76 పరుగులు జోడించారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి మరో వికెట్ కోల్పోకుండా 174 పరుగుల స్కోరును చేరుకుంది. పడిన ఐదు వికెట్లలో జేమ్స్ అండర్సన్‌కు మూడు వికెట్లు దక్కగా... మ్యాటీ పాట్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు.