ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో టీమిండియాకు నేడు చాలా కీలకం. అ టెస్టులో కనుక భారత్ నెగ్గితే 2-2తో ఐదు టెస్టుల సిరీస్ సమం అవుతుంది. భారత్ కనుక ఓటమిపాలైతే 3-1తో సిరీస్ చేజారుతుంది. ఓవల్ టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224 పరుగులు చేసి ఆలౌట్ అయినప్పుడు, చివరి టెస్ట్ చేజారిందని అంతా అనుకున్నారు. భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను కేవలం 23 పరుగులు మాత్రమే ఆధిక్యంలో ఆలౌట్ చేయడంతో భారత్ రేసులోకి వచ్చింది.
రెండో ఇన్నింగ్స్ లో భారత్ సమష్టిగా రాణించింది. ఈ టెస్టులో ఇంగ్లీష్ జట్టుకు 374 పరుగుల లక్ష్యం నిర్ధేశించగా, బెన్ డకెట్, జాక్ క్రాలీ 50 పరుగుల భాగస్వామ్యంతో ఆతిథ్య జట్టుకు మంచి ప్రారంభం అందించారు. అయితే, ఇంగ్లండ్ ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించగలదా? వాస్తవానికి, ఓవల్ మైదానంలో 300 పరుగుల లక్ష్యాన్ని ఏ జట్టైనా ఛేదించిందా అని గణాంకాలు చెక్ చేసిన భారత అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ స్టేడియంలో ఒక్కసారి కూడా 300 టార్గెట్ ఏ జట్టు కూడా ఛేదించలేదని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ ఇంగ్లండ్ ఛేజ్ చేస్తే కనుక, అది చారిత్రాత్మక విజయం అవుతుంది.
ఓవల్ మైదానంలో అత్యధిక పరుగుల రికార్డు
టెస్ట్ క్రికెట్‌లో ఓవల్ మైదానంలో ఛేజింగ్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు 263 పరుగులు. 1902లో ఆస్ట్రేలియాపై ఆతిథ్య ఇంగ్లాండ్ ఈ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్ 123 సంవత్సరాల కిందట జరిగింది. ఆ తరువాత 1963లో వెస్టిండీస్ ఇంగ్లండ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 జాబితాలో నాలుగు స్కోర్‌లు 20వ శతాబ్దంలో నమోదయ్యాయి. 21వ శతాబ్దంలో, ఓవల్ మైదానంలో అత్యధిక పరుగులు 2024లో నమోదయ్యాయి. శ్రీలంక 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది.
- 263 పరుగులు - ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా - 1902
- 252 పరుగులు - వెస్టిండీస్ vs ఇంగ్లండ్ - 1963
- 242 పరుగులు - ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ - 1972
- 225 పరుగులు - వెస్టిండీస్ vs ఇంగ్లండ్ - 1988
- 219 పరుగులు - శ్రీలంక vs ఇంగ్లండ్ - 2024
టెస్ట్ క్రికెట్‌లో ఓవల్ మైదానంలో 263 కంటే ఎక్కువ పరుగులు ఎప్పుడూ ఛేదించలేదని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, భారత జట్టు ఇంగ్లాండ్ ముందు అంతకంటే 111 పరుగులు ఎక్కువ (374 రన్స్) లక్ష్యాన్ని ఉంచింది. గత రికార్డులను పరిశీలిస్తే ఈ టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. నేడు 4వ రోజు కావడంతో పర్యాటక జట్టు భారత్ టెన్షన్ పడుతోంది. అందులోనూ ఇంగ్లాండ్ బ్యాజ్‌బాల్ శైలి సమస్యగా మారే అవకాశం లేకపోలేదు.
24 ఏళ్ల కిందట చివరి విజయం..
ఓవల్ మైదానంలో ఇది భారత్ ఆడుతున్న 16వ టెస్ట్ మ్యాచ్ ఇది. ఒకవేళ వారు ఇంగ్లండ్‌ను ఓడిస్తే, ఇది టీమ్ ఇండియాకు ఈ వేదికలో 3వ టెస్ట్ మ్యాచ్ విజయం అవుతుంది. ఇంతకుముందు భారత్ 1971, 2021లో విజయాలు సాధించింది. భారత్ ఇక్కడ నెగ్గి 24 ఏళ్లు కావొస్తుంది. అయితే ఓవల్ స్టేడియంలో హయ్యస్ట్ ఛేజింగ్ కంటే వంద పరుగుల కంటే ఎక్కువ టార్గెట్ ఇవ్వడంతో భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి.