IND vs ENG Manchester Test Result: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెండు రోజుల ముందు భారత జట్టు ఓటమి ఖాయమనిపించింది. సిరీస్ 3-1 అవుతుందని మ్యాచ్ చేజారిపోతున్నట్లు కనిపించింది. కానీ భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఓపెనర్ బ్యాట్స్‌మెన్ కెఎల్ రాహుల్, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్  అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అంతా అనుకున్నట్లుగానే చాలా కాలం కిందటి నాటింగ్ హాట్ టెస్టు స్ఫూర్తిని మళ్లీ ప్రదర్శించారు. దాంతో ఓడిపోయే మ్యాచ్‌ను టీమ్ ఇండియా డ్రాగా ముగించింది. నాలుగో టెస్టులో భారత్ ఓటమి గండం గట్టెక్కి సగర్వంగా నిలిచిందంటే ఆ నలుగురే కారణం. వారు ఈ మ్యాచ్‌ను ఎలా మార్చారో తెలుసుకుందాం.

1- భారత్ 358 పరుగులకు ఆలౌట్

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రిషబ్ పంత్ అర్ధ సెంచరీలతో 358 పరుగులకు ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ కూడా 46 పరుగులు సాధించాడు. లోయర్ ఆర్డర్ కాస్త పోరాడటంతో భారత్ 300 స్కోర్ చేయగలిగింది.

2- ఇంగ్లండ్ భారీ లక్ష్యం

ఓపెనింగ్ బ్యాటర్లు బెన్ డకెట్ 94 పరుగులు, జాక్ క్రాలీ 84 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత జో రూట్ 150 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 141 పరుగులతో శతకాలు చేయడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ అవసరమా అనే స్థితికి చేరుకుంది. ఇంగ్లాండ్ మూడో రోజు, నాలుగోరోజు ఆటలో 669 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 311 పరుగుల ఆధిక్యాన్ని ఇంగ్లాండ్ సాధించింది.

3- భారత్ ఓటమి దాదాపు ఖాయం

నాలుగో రోజు ఆటలో భారత్ ఓడిపోవడం ఖాయమని అంతా అనుకున్నారు. టీమిండియా ఒక్క పరుగు కూడా చేయకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ ఖాతా తెరవకుండానే క్రిస్ వోక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ అవుట్ కావడంతో భారత్ 311 పరుగుల స్కోరు చేస్తుందా అనిపించింది. ఒకవేళ ఈ స్కోర్ చేసినా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ చేయడానికి స్కోరు కూడా లేదు. 

4- గిల్-రాహుల్ క్లాస్ బ్యాటింగ్

జైస్వాల్, సాయి సుదర్శన్ అవుటయ్యాక కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ మరో వికెట్ పడకుండా అడ్డు గోడలా నిలబడ్డారు. మరోవైపు పరుగులు చేస్తూ ఇన్నింగ్స్ నిలబెట్టారు. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఆధిక్యం కేవలం 137 పరుగులకు పరిమితం చేశారు. ఇంగ్లండ్ గెలవాలంటే చివరి రోజు 8 వికెట్లు తీయాలి. వాస్తవానికి అది పెద్ద విషయం కాదు. కానీ గిల్ సెంచరీ, రాహుల్ 90 స్కోరుతో భారత్ కొంచెం పటిష్టంగా కనిపించింది. అదే ఊపుతో వికెట్లు ఇవ్వకుండా మ్యాచ్ ను డ్రా చేసే దిశగా బ్యాటింగ్ చేశారు. .

5- జడేజా- సుందర్ విలువైన భాగస్వామ్యం

మ్యాచ్ ఐదవ రోజున కెఎల్ రాహుల్ 90 పరుగులకు అవుట్ అయ్యాడు. తర్వాత సెంచరీ హీరో గిల్ 103 పరుగుల వద్ద ఔటయ్యాడు. గాయంతో ఉన్న పంత్ బదులుగా వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చాడు. రవీంద్ర జడేజా, సుందర్ ఏమాత్రం తడబాటుకు లోనుకాకుండా తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ కొనసాగించారు. రవీంద్ర జడేజా 107 పరుగులు, సుందర్ 101 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని ఓడిపోయే మ్యాచ్ డ్రా చేశారు. మూడో టెస్టులో విజయానికి చేరువైన సమయంలో భారత్ ఆలౌటైంది. ఈసారి అలాంటి తప్పిదాలు చేయకుండా వికెట్లు కాపాడుకుంటూ పరుగులు సాధించారు. వీరి సెంచరీలు అడ్డుకునేందుకు చివర్లో బెన్ స్టోక్స్ షేక్ హ్యాండ్ ఇచ్చినా డ్రా చేసుకోవడానికి జడేజా, సుందర్ నిరాకరించారు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి టెస్టు మ్యాచ్ ను వీక్షించేలా చేశారు.