Manchestar Test- Ind vs Eng 4th Test Latest Live Updates: ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్) రెండు సెషన్లపాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి, మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించారు. అయితే మ్యాచ్ లో ఫలితం ఇక తమకు అనుకూలంగా రాదని, డ్రా గా ముగుస్తుందని తేలాక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా కోసం పట్టుపట్టాడు.
భారత క్రికెటర్లు జడేజా, సుందర్ లతో కాస్త వాగ్వాదానికి దిగాడు. ఈ సంఘటనను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన భారత అభిమానులతోపాటు మాజీ క్రికెటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు జెన్యూన్ ఆల్ రౌండర్ గా కితాబు అందుకున్న స్టోక్స్.. ఒక్కసారిగా ఇలా దిగజారుడుగా వ్యవహరించడంఫై ఫైర్ అవుతున్నారు.
మారథాన్ భాగస్వామ్యం..నిజానికి మ్యాచ్ తొలి సెషన్ లో కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్ ఔటయ్యాక మ్యాచ్ లో భారత్ క్లిష్ట పరిస్థితుల్లో నిలిచింది. ఈ దశలో సుందర్, జడేజా అద్భుత పోరాట పటిమ ప్రదర్శించారు. 55.2 ఓవర్లకుపైగా బ్యాటింగ్ చేసి, అబేధ్యమైన ఐదో వికెట్ కు 203 పరుగులు చేశారు. అయితే మాండేటరీ అవర్ సమయంలో స్టోక్స్ డ్రాకు ప్రతిపాదించాడు. అసమయంలో జడేజా, సుందర్ సెంచరీలకు అతి చేరువలో ఉన్నారు. అయినా కూడా మ్యాచ్ ను డ్రా గా ముగిద్దామని ప్రతిపాదించాడు. అయితే దీన్ని జడేజా సున్నితంగా తిరస్కరించాడు. డ్రాగా ముగించడంపై నిర్ణయం తీసుకోవాల్సింది తమ కెప్టెన్ గిల్ మాత్రమేనని చురక అంటించాడు. ఈ క్రమంలో స్టోక్స్.. హేరీ బ్రూక్, బెన్ డకెట్ బౌలింగ్ లో సెంచరీ చేస్తావా..? అని సంకుచిత వ్యాఖ్యలు చేశాడు. మరో ఎండ్ లో డకెట్ కూడా మాటలతో ఎదురుదాడి చేశాడు. అయినప్పటికీ జడేజా, సుందర్ లు బ్యాటింగ్ కే మొగ్గు చూపారు. కాసేపటికే ఇద్దరు సెంచరీలు చేశాక, మ్యాచ్ డ్రాగా ముగిసింది.
బౌలర్లు గాయాలపాలు కాకుడదని..మ్యాచ్ ముగిశాక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును స్టోక్స్ అందుకున్నాడు. ఈ సందర్బంగా ఈ సంఘటనపై వ్యాఖ్యానించాడు. అప్పటికే 130కిపైగా ఓవర్లు బౌలింగ్ చేయడంతో తమ బౌలర్లు అలిసి పోయారని, అందుకే డ్రాకు ప్రతిపాదించానని పేర్కొన్నాడు. అయితే దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అప్పటివరకు విరోచితంగా ఆడిన ప్లేయర్లపై స్టోక్స్ నోరు పారేసుకున్నాడని పలువురు మండి పడుతున్నారు. సెంచరీకి ముందు ఇంగ్లాండ్ ప్రీమియర్ బౌలర్లను జడ్డూ, సుందర్ ఎదుర్కొన్నారని గుర్తు చేస్తున్నారు.
ఏదేమైనా గత నాలుగు టెస్టుల్లో అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న స్టోక్స్.. నాలుగోటెస్టు ఆఖరి రోజు నోరు పారేసుకుని చులకన అయ్యాడని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఓడిపోయే మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతోపాటు, ప్రత్యర్థి కెప్టెన్ ను డ్రా కోసం అర్థించేలా టీమిండియా చేయడంతో నైతిక విజయం గిల్ సేనదేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తాజా ఫలితంతో టీమిండియా ప్లేయర్ల ఆత్మవిశ్వాసం స్కై హైలో ఉందని, ఇదే జోరులో ఐదో టెస్టులో గెలిచి ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని 2-2తో సమం చేయాలని సూచిస్తున్నారు.