Manchestar Test Latest Live Updates: అద్భుతం జరిగింది. ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్టును ఇండియా డ్రాగా మలిచింది. ఐదు సెషన్లపాటు అద్భుతంగా బ్యాటింగ్ చేసిన టీమిండియా బ్యాటర్లు 143 ఓవర్లకుపైగా బ్యాటింగ్ చేశారు. ఆదివారం ఐదో రోజు మారథాన్ ఇన్నింగ్స్ లో భారత్ ఓవరాల్ గా 4 వికెట్లకు 425 పరుగులు చేయగా.. ఇరుజట్లు డ్రాకు అంగీకరించడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ సెంచరీ (185 బంతుల్లో 107 నాటౌట్, 13 ఫోర్లు, 1 సిక్సర్) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా కకెరీర్ లో తొలి సెంచరీ (206 బంతుల్లో 101 నాటౌట్, 9 ఫోర్లు, 1 సిక్సర్) తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన ఐదో వికెట్ కు 335 బంతుల్లో 203 పరుగులు జోడించారు. తాజా ఫలితంతో ఐదు టెస్టుల అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఆఖరిదైన ఐదో టెస్టు ఈనెల 31 నుంచి ద ఓవల్, లండన్ లో జరగుతుంది.
గిల్ రికార్డు సెంచరీ..అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 174/2 తో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత్ కు కాసేపటికే ఎదురు దెబ్బ తగిలింది. భాగస్వామ్యాలను విడదీయడంలో పేరు గాంచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి తన జాదును చూపించాడు. తన బౌలింగ్ దిగిన కాసేపటికే కేఎల్ రాహుల్ (230 బంతుల్లో 90, 8 ఫోర్లు)ను అద్బుత బంతితో ఎల్బీ చేశాడు. ఈ దశలో జడేజా కంటే ముందు సుందర్ ను పంపి, భారత్ ప్రయోగం చేయగా అది అద్భుత ఫలితాన్నిచ్చింది. వీరిద్దరూ చక్కగా బ్యాటింగ్ చేశారు. ఇదే జోరులో శుభమాన్ గిల్ (238 బంతుల్లో 103, 12 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకుని, ఇంగ్లీష్ గడ్డపై 700 పరుగులను ఒక సిరీస్ లో చేసిన ఆసియన్ గా నిలిచాడు. సెంచరీ తర్వాత లంచ్ విరామానికి ముందు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో గిల్.. కీపర్ క్యాచ్ ఔటయ్యాడు.
రెండు సెషన్లపాటు..ఒకే సెషన్లో రాహుల్ తోపాటు గిల్ వికెట్లను కోల్పోవడం, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయంతో బ్యాటింగ్ కు దిగడం కష్టంగా మారడంతో ఇండియా కష్టాల్లో పడింది. ఈ దశలో జడేజా, సుందర్ అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తనకు లభించిన లైఫ్ ను సద్వినియోగం చేసుకున్న జడేజా.. ఈ సిరీస్ లో తొలి సెంచరీ చేశాడు. అలాగే మ్యాచ్ చివర్లో సుందర్ కూడా కెరీర్ లో తొలి సెంచరీ చేశాడు. అంతకుముండు డ్రా కోసం స్టోక్స్ విఫలయత్నం చేశాడు. వీరిద్దరూ సెంచరీలు చేసిన తర్వాత ఇరుజట్లు డ్రాకు అంగీకరించాయి. దీంతో మ్యాచ్ డ్రా ముగిసింది. 2022లో ఇంగ్లాడ్ కోచ్ గా బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుకు ఎదురైన రెండో డ్రా ఇదే కావడం విశేషం. 311 పరుగుల లోటుతో తీవ్ర ఒత్తిడిలో ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించిన భారత్.. నైతిక విజయం సాధించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈనెల 31 నుంచి జరిగే ఐదో టెస్టులో సమరోత్సాహంతో గిల్ సేన బరిలోకి దిగనుందని భావిస్తున్నారు.