India 326 for five  at stumps vs England in Rajkot: టీమిండియా సారధి రోహిత్‌ శర్మ(Rohit Sharma), లోకల్‌ బాయ్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) శతక గర్జన చేయడంతో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత జట్టును రోహిత్‌, రవీంద్ర జడేజా అద్భుత శతకాలతో ఆదుకుని పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అర్ధశతకంతో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.  దురదృష్టవశాత్తు సర్ఫరాజ్‌ రనౌట్‌ అయినా... సాధికార బ్యాటింగ్‌తో తన ఎంపిక సరైందేనని నిరూపించుకున్నాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు. 

 

ఆరంభంలో షాక్‌ మీద షాక్‌లు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకోగా రోహిత్‌శర్మ, గత మ్యాచ్‌ హీరో ।యశస్వీ  జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. అలా ఆట అరంభమైందో లేదో నాలుగో ఓవర్‌లోనే యశస్వి జైస్వాన్‌ అవుటయ్యాడు. మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి యశస్వి అవుటయ్యాడు. దీంతో టీమిండియా 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత 24 పరుగుల వద్ద శుభ్‌మన్‌ గిల్‌ డకౌట్‌ అయ్యాడు. మార్క్‌ వుడ్‌ వేసిన ఓవర్‌లో గిల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకున్న బంతి కీపర్‌ చేతిలో పడింది. తొమ్మిది బంతులు ఆడిన గిల్‌ ఒక్క పరుగు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. అనంతరం టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. హార్ట్‌ లీ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి రజత్‌ పాటిదార్‌ అవుటయ్యాడు. కేవలం అయిదు పరుగులే చేసి రజత్‌ పాటిదార్‌ అవుట్‌ అయ్యాడు. దీంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.

 

రోహిత్‌-జడేజా శతక మోత

33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా ఆదుకున్నారు. హిట్ మ్యాన్‌ తన సహజశైలికి విరుద్ధంగా ఆచితూచి ఆడాడు. ఆరంభంలో రోహిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్‌ స్లిప్‌లో రూట్‌ వదిలేశాడు. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న రోహిత్‌ శర్మ అద్భుత శతకంతో భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. 157 బంతుల్లో రోహిత్‌ శర్మ శతకాన్ని అందుకున్నాడు. టెస్టుల్లో రోహిత్‌కు ఇది పదకొండో సెంచరీ కావడం గమనార్హం. కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రోహిత్‌ శర్మ 131 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రోహిత్‌- జడేజా 200 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 237 పరుగుల వద్ద రోహిత్ అవుటవ్వడంతో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. 

 

జడేజా-సర్ఫరాజ్ జోరు

అనంతరం జడేజాతో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ జత కలిశాడు. వీరిద్దరూ వేగంగా పరుగులు తీస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలో సొంత మైదానంలో జడేజా శతకంతో మెరిశాడు. 198 బంతుల్లో రవీంద్ర జడేజా సెంచరీ చేసి భారత్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. టెస్టుల్లో జడేజాకు ఇది నాలుగో సెంచరీ. సర్ఫరాజ్‌ కూడా ఆడిన తొలి టెస్ట్‌లోనే అర్ధ శతకం సాధించి సత్తా చాటాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌  హాఫ్‌ సెంచరీ చేశాడు. అనంతరం సింగిల్‌ కోసం ప్రయత్నిస్తూ రనౌట్‌ అయ్యాడు. అనంతరం కుల్‌దీప్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు. మూడో టెస్ట్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా అయిదు వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా.. కుల్‌దీప్‌ యాదవ్‌ ఉన్నారు.