ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఇంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడంతో టీమిండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. దీంతో 17 పరుగులతో ఇంగ్లండ్ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ (117: 55 బంతుల్లో, 14 ఫోర్లు, ఆరు సిక్సర్లు) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది.


లివింగ్‌స్టోన్, మలన్ షో
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్ సాఫీగా ప్రారంభం అయింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (27: 26 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), జోస్ బట్లర్ (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) సిరీస్‌లో మొదటిసారి తొలి ఓవర్లో వికెట్ కోల్పోలేదు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 3.4 ఓవర్లలోనే 31 పరుగులు జోడించారు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన జోస్ బట్లర్‌ను అవేష్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు మొదటి వికెట్ అందించాడు.


తర్వాత జేసన్ రాయ్, సాల్ట్ (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ 84 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వీరు అవుటయ్యాక డేవిడ్ మలన్, లియాం లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో డేవిడ్ మలన్, మొయిన్ అలీలను అవుట్ చేశాడు.


అయినా ఇంగ్లండ్ స్కోరు వేగం తగ్గలేదు. హ్యారీ బ్రూక్ (19: 9 బంతుల్లో, మూడు ఫోర్లు), క్రిస్ జోర్డాన్ (11: 3 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), డేవిడ్ మలన్ పోటీ పడి బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా భారీ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసుకోగా... అవేష్ ఖాన్, ఉమ్రాన్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.


సూర్యకుమార్ యాదవ్ తప్ప
215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చిందంటే దానికి కర్త, కర్మ, క్రియ అన్నీ సూర్యకుమార్ యాదవే. తను మినహా ఇంకెవరూ క్రీజులో కాసేపు కూడా నిలబడలేకపోయారు. శ్రేయస్ అయ్యర్ (28: 23 బంతుల్లో, రెండు సిక్సర్లు) మాత్రమే తనకు కాసేపు అండగా నిలిచాడు.


రోహిత్ శర్మ (11: 12 బంతుల్లో, రెండు ఫోర్లు), రిషబ్ పంత్ (1: 5 బంతుల్లో), విరాట్ కోహ్లీ (11: 6 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా ఇలా అందరూ ఘోరంగా విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్‌కు తోడుగా మరో స్పెషలిస్ట్ బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉన్నా ఈ మ్యాచ్ మన సొంతం అయ్యేది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒత్తిడిలో భారీ షాట్ ఆడి అవుటయ్యాడు. దీంతో భారత్ కథ ముగిసింది.