టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలన్ (77: 39 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్లు), లియాం లివింగ్‌స్టోన్ (42 నాటౌట్: 29 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) రాణించారు. భారత్ విజయానికి 120 బంతుల్లో 216 పరుగులు కావాలి.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా ప్రారంభం అయింది. ఓపెనర్లు జేసన్ రాయ్ (27: 26 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), జోస్ బట్లర్ (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) సిరీస్‌లో మొదటిసారి తొలి ఓవర్లో వికెట్ కోల్పోలేదు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ 3.4 ఓవర్లలోనే 31 పరుగులు జోడించారు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన జోస్ బట్లర్‌ను అవేష్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేసి టీమిండియాకు మొదటి వికెట్ అందించాడు.
తర్వాత జేసన్ రాయ్, సాల్ట్ (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ 84 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. వీరు అవుటయ్యాక డేవిడ్ మలన్, లియాం లివింగ్‌స్టోన్ ఇంగ్లండ్ స్కోరును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ ఒకే ఓవర్లో డేవిడ్ మలన్, మొయిన్ అలీలను అవుట్ చేశాడు.
అయినా ఇంగ్లండ్ స్కోరు వేగం తగ్గలేదు. హ్యారీ బ్రూక్ (19: 9 బంతుల్లో, మూడు ఫోర్లు), క్రిస్ జోర్డాన్ (11: 3 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), డేవిడ్ మలన్ పోటీ పడి బౌండరీలు కొట్టడంతో ఇంగ్లండ్ ఒక వైపు వికెట్లు కోల్పోతున్నా భారీ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు తీసుకోగా... అవేష్ ఖాన్, ఉమ్రాన్ మలిక్ చెరో వికెట్ దక్కించుకున్నారు.