ఇంగ్లండ్‌తో జరుగుతున్న మొదటి టీ20లో టీమిండియా ఆఖర్లో తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా (51: 33 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ విజయానికి 120 బంతుల్లో 199 పరుగులు కావాలి.


టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు.


అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్‌లకు చెరో వికెట్ దక్కింది.