Rohit Sharma Ruled Out:  టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఎడమచేతి బొటనవేలి గాయంతో మొదటి టెస్ట్ ఆడని హిట్ మ్యాన్ రెండు మ్యాచ్ లోనూ ఆడడని తెలుస్తోంది. దీంతో కేఎల్ రాహుల్ రెండో టెస్టుకు నాయకత్వం వహించనున్నాడు. 


బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో క్యాచ్ పట్టే సమయంలో రోహిత్ ఎడమవేలికి గాయమైంది. దాంతో అతను ఫీల్డింగ్ చేయలేదు. అయితే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత స్పెషలిస్ట్ వైద్యున్ని సంప్రదించేందుకు హిట్ మ్యాన్ ముంబయి వెళ్లాడు. ఈ క్రమంలో బంగ్లాతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు. రెండో మ్యాచుకు అందుబాటులో ఉంటాడని భావించినా.. టీం మేనేజ్ మెంట్, బీసీసీఐ రోహిత్ తో రిస్క్ చేయకూడదని భావిస్తోంది. దీంతో రెండో టెస్టులోనూ ఆడడని  తెలుస్తోంది.


రిస్క్ చేయం


గాయం నుంచి రోహిత్ శర్మ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ..  'ఈ సమయంలో అతను మైదానంలోకి దిగితే గాయం పెద్దదయ్యే ప్రమాదముంది. ఇప్పుడు బంగ్లాతో తొలి టెస్టును భారత్ గెలుచుకుంది. కాబట్టి రోహిత్ తో రిస్క్ చేయదలచుకోలేదు. వచ్చే నెలలో స్వదేశంలో శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ లు ఉన్నాయి. కాబట్టి అప్పటికి రోహిత్ పూర్తిగా కోలుకుని అందుబాటులో ఉంటాడు.' అని అతను తెలిపాడు. 


మొదటి టెస్టులో భారత్ ఘనవిజయం


ఛట్టోగ్రామ్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. శుభ్ మన్ గిల్, పుజారా, శ్రేయస్ అయ్యర్, అశ్విన్, కుల్దీప్ వంటి ఆటగాళ్లు రాణించాడు. రోహిత్ గైర్హాజరీలో జట్టును కేఎల్ రాహుల్ నడిపించాడు. 


మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి రోజు బంగ్లా బౌలర్ల ధాటికి ఒక దశలో 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కష్టాల్లో పడిన టీమిండియాను పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (86) లు ఆదుకున్నారు. లోయరార్డర్ లో అశ్విన్ (58), కుల్దీప్ (40) కూడా రాణించటంతో మొదటి ఇన్నింగ్సులో భారత్ 404 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 3 వికెట్లతో టాపార్డర్ ను పడగొట్టగా.. కుల్దీప్ 5 వికెట్లతో లోయరార్డర్ పని పట్టాడు. దీంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది.


రెండో ఇన్నింగ్స్ లో గిల్, పుజారాలు శతకాలు బాదటంతో టీమిండియా 2 వికెట్లకు 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా ముందు 513 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ బ్యాటర్లు బాగానే పోరాడారు. ఆ జట్టు ఓపెనర్లు శాంటో (67), జకీర్ హసన్ (100) లు మొదటి వికెట్ కు 124 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే మిడిలార్డర్ లో షకీబుల్ హసన్ (84) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమవటంతో బంగ్లా 188 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.