Ishan Kishan ODI hundred:  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్ శర్మ గాయంతో దూరమవటంతో జట్టులోకొచ్చిన ఈ యువ ఆటగాడు వన్డేల్లో తన మొదటి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్ 25 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. ఇషాన్ కో తోడుగా విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నాడు.


24 ఏళ్ల ఈ ఓపెనర్ వచ్చీ రావడంతోనే దూకుడుగా తన ఆటను మొదలుపెట్టాడు. ధావన్ పేలవ ఫామ్ ను కొనసాగిస్తూ త్వరగానే ఓటైనా... ఇషాన్ మాత్రం దూకుడు మంత్రాన్నే అవలంభించాడు. కోహ్లీ అండగా ఎడాపెడా ఫోర్లు, సిక్సులు బాదుతూ చూస్తుండగానే సెంచరీకి చేరువయ్యాడు. 85 బంతుల్లో తన తొలి సెంచరీని అందుకున్నాడు. మరోవైపు కోహ్లీ నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. 


సెంచరీ తర్వాత మరింత చెలరేగి ఆడిన ఇషాన్ కిషన్ మరో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసి 150 మార్కును అందుకున్నాడు. 






చట్టోగ్రామ్ వేదికగా భారత్- బంగ్లా మధ్య మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా జట్టులో రెండు మార్పులు చేశారు. శాంటో, నసుమ్ అహ్మద్ స్థానంలో తస్కిన్ అహ్మద్, యాసిర్ అలీ ఆ జట్టులోకి వచ్చారు. 'పిచ్ పై పచ్చిక ఉంది. త్వరగా ప్రత్యర్థి వికెట్లు పడగొట్టి వారిపై ఒత్తిడి తెస్తాం. మా సహజమైన ఆటను ఆడాలనుకుంటున్నాం' అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ అన్నాడు. 


'గాయాలు మా జట్టుపై ప్రభావం చూపిస్తున్నాయి. మేం ఎప్పుడూ మా అత్యుత్తమ ఆటను ఇవ్వడానికే ప్రయత్నిస్తాం. వన్డేలు ఆడి చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ గెలవడంపైనే మా దృష్టి ఉంది. రోహిత్, దీపక్ చాహర్ స్థానంలో ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్ లు జట్టులోకి వచ్చారు.' అని భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. 


బంగ్లాదేశ్ తుది జట్టు


 లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తస్కిన్ అహ్మద్.


భారత్ తుది జట్టు 


శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్. రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.