IND vs BAN 2nd Test: భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఆఖరిదైన రెండో టెస్టులో ఇరు జట్లు విజయానికి సమాన దూరంలో నిలిచాయి. 145 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇంకా విజయానికి 100 పరుగులు అవసరం. స్పిన్నర్లకు విపరీతంగా సహకరిస్తున్న పిచ్ పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొని భారత్ అవసరమైన పరుగులు సాధిస్తుందా! లేదా మిగిలిన 6 వికెట్లు తీసి బంగ్లాదేశ్ విజయం సాధిస్తుందా! అనేది రేపు తేలనుంది.
తిప్పేసిన బంగ్లా స్పిన్నర్లు
145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లను బంగ్లా స్పిన్నర్లు హడలెత్తించారు. బంతి బంతికీ వికెట్ పడేలా అనిపించిన పిచ్ పై భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పేలవ ఫామ్ ను కొనసాగించిన కెప్టెన్ రాహుల్ 10 బంతులైనా ఆడకుండానే 2 పరుగులకు షకీబుల్ హసన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ ఆరంభించిన పుజారా (6) కూడా మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. ఈ దశలో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అక్షర్ పటేల్, శుభ్ మన్ గిల్ లు ఆచితూచి ఆడారు. పరుగులు చేయకపోయినా కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే గిల్ ను కూడా మిరాజ్ (35 బంతుల్లో 7) ఔట్ చేశాడు. తర్వాత కోహ్లీ (1) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అతని వికెట్ ను కూడా మిరాజే పడగొట్టాడు. అయితే ఓవైపు అక్షర్ పటేల్ (26 నాటౌట్) క్రీజులో కుదురుకుని ఆడాడు. చివర్లో జైదేవ్ ఉనద్కత్ క్(3) నైట్ వాచ్ మన్ గా వచ్చాడు.
అంతకుముందు బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్సులో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. అశ్విన్, సిరాజ్ లు తలా 2 వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్, ఉమేష్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.