IND vs BAN 2nd Test:  భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్సులో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టీమిండియా ముందు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 


టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది. 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. అశ్విన్, సిరాజ్ లు తలా 2 వికెట్లు పడగొట్టారు. ఉనద్కత్, ఉమేష్ యాదవ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. 


వెంటవెంటనే వికెట్లు


87 పరుగుల లోటుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ మూడో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 8వ ఓవర్లో అశ్విన్, శాంటో (5)ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. సిరాజ్ 13వ ఓవర్లో  మోమినల్ హక్ (5) ను కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత షకీబుల్ హసన్, జకీర్ హసన్ లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద ఉనద్కత్ బౌలింగ్ లో షకీబ్ (13) ఔటయ్యాడు. ఆ వెంటనే ముష్ఫికర్ రహీం (9)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. అయితే జకీర్ హసన్ నిలబడటంతో లంచ్ సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్లకు 71 పరుగులు చేసింది.






రాణించిన లిటన్ దాస్, జకీర్ హసన్


ఆ తర్వాత బంగ్లా బ్యాటర్లు జకీర్ హసన్ (51), లిటన్ దాస్ (73) పరుగులతో రాణించారు. ముఖ్యంగా లిటన్ వేగంగా పరుగులు చేశాడు. వికెట్ కీపర్ నురుల్ హసన్ (31), టెయిలెండర్ తస్కిన్ అహ్మద్ (31)తో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పారు. అయితే భారత బౌలర్లు కూడా క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ప్రమాదకరంగా మారుతున్న లిటన్ దాస్ ను సిరాజ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 


87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఉన్న టీమిండియా విజయానికి ప్రస్తుతం 145 పరుగులు కావాలి.