Karthik on IND vs BAN:  ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ లో 186 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ స్కోరును కాపాడేందుకు బౌలర్లు గట్టి ప్రయత్నమే చేశారు. దాదాపుగా జట్టును గెలిపించినంత పని చేశారు. ఒక దశలో 136 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన బంగ్లా ఓటమి అంచున నిలిచింది. అయితే మెహదీ హసన్, ముస్తాఫిజర్ రెహ్మాన్ ల 51 పరుగుల చివరి వికెట్ భాగస్వామ్యం ఆ జట్టుకు విజయాన్ని అందించింది. ముఖ్యంగా మెహదీ హసన్ 39 బంతుల్లో 38 పరుగులు చేసి బంగ్లా విజయంలో కీలకపాత్ర పోషించాడు. 


అయితే టీమిండియా ఫీల్డింగ్ తప్పిదాలు కూడా బంగ్లాదేశ్ గెలుపునకు కారణమయ్యాయి. 43వ ఓవర్లో మెహదీ హసన్ ఇచ్చిన క్యాచును వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ జారవిడిచాడు. అలాగే ఆ తర్వాతి బంతిని ఓవర్ త్రో చేయటంతో బంగ్లాకు ఒక బౌండరీ లభించింది. మొత్తానికి చివరి వికెట్ పడగొట్టలేక భారత్ అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. దీనిపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాట్లాడాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ జట్టులో వికెట్ కీపర్ గా కార్తీక్ బాధ్యతలు నిర్వహించాడు. 


రోహిత్ వారితో మాట్లాడి ఉంటాడు


తమ జట్టు బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనలతో కెప్టెన్ రోహిత్ శర్మ కచ్చితంగా నిరాశ చెంది ఉంటాడని కార్తీక్ అన్నాడు. 'బ్యాటర్ల ఆట గురించి రోహిత్ కచ్చితంగా వారితో మాట్లాడి ఉంటాడు. రోహిత్ తప్పనిసరిగా తన బౌలర్లకు క్రెడిట్ ఇస్తాడు. తక్కువ స్కోరును కాపాడేందుకు వారు చాలా ప్రయత్నించారు. వెంటవెంటనే వికెట్లు తీసి భారత్ ను పోటీలో నిలిపారు. 40 ఓవర్ల వరకు వారి బౌలింగ్ చాలా బాగుంది.' అని కార్తీక్ అన్నాడు. భారత్ ఫీల్డింగ్ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ 43వ ఓవర్లో మెహదీ హసన్ క్యాచును జారవిడిచాడు. 'ఫీల్డర్ల ప్రదర్శనతో రోహిత్ నిరాశ చెంది ఉంటాడు. ఫీల్డర్ల నుంచి మరింత మెరుగైన ప్రదర్శనను ఆశించవచ్చు. తేలికైన బౌండరీలను ఇవ్వకూడదు.' అని అన్నాడు. 



స్కోరు గురించి కాదు.. దాని గురించి ఆలోచించాలి


రాబోయే రెండు మ్యాచుల్లో బాగా ఆడాలని దినేశ్ కార్తీక్ సూచించాడు. వాస్తవికంగా ఆడాలని 300- 320 స్కోరు గురించి ఆలోచించవద్దని చెప్పాడు. 'మనం ఏం చేయగలమో దానిని లక్ష్యంగా చేసుకుని బ్యాటింగ్ చేయాలని అన్నాడు. రెండు ప్రాక్టీస్ సెషన్లు ఆటగాడిలో పెద్ద మార్పులు తీసుకురావు. ఒక ఆటగాడు ఆత్మపరిశీలన చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. భారత జట్టులో మంచి విషయం ఏమిటంటే... ప్రతికూల పరిస్థితుల నుంచి తిరిగి పుంజుకునే సామర్థ్యం ఉండడం. దీని ద్వారానే వారు అగ్రస్థానంలో ఉండే మార్గాన్ని వెతుక్కున్నారు.' అని దినేశ్ కార్తీక్ వివరించాడు. 


రేపు బంగ్లాదేశ్, భారత్ మధ్య ఢాకా వేదికగానే రెండో వన్డే జరగనుంది. మరి ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ఆశలను టీమిండియా నిలుపుకుంటుందో లేదో చూడాలి.