Irfan Pathan On Ashwin: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్ ను... భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసించాడు. తొలి రోజు ఆస్ట్రేలియా 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జడేజా 5 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు సాధించాడు.
ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు
అప్పటికి 109 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆస్ట్రేలియాను అలెక్స్ క్యారీ (36), హ్యాండ్స్ కాంబ్ (31) ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరి భాగస్వామ్యం బలపడుతున్న వేళ క్యారీని ఔట్ చేసి అశ్విన్ బ్రేక్ ఇచ్చాడు. ఈ సందర్భంగానే అశ్విన్ ను పఠాన్ అభినందించాడు. 'నేను మానసికంగా కంప్యూటర్ లాంటి బౌలర్ గురించి మాట్లాడుతున్నాను. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే దానిపై అతని మెదడు ఎప్పుడూ పని చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు బ్యాటర్లను ఎలా ఇబ్బందిపెట్టాలనే విషయాలపై అశ్విన్ బ్రెయిన్ ఆలోచిస్తూనే ఉంటుంది.' అని అన్నాడు.
బాగా ఆడుతున్న అలెక్స్ క్యారీని అశ్విన్ ఔట్ చేసిన విధానంపై పఠాన్ అభినందించాడు. 'ఇది చాలా అవసరమైన వికెట్. అప్పటికీ క్యారీ బాగా ఆడుతున్నాడు. క్రమం తప్పకుండా స్వీప్ లు, రివర్స్ స్వీప్ లు ఆడుతున్నాడు. ఆ భాగస్వామ్యాన్ని విడదీయడం చాలా ముఖ్యం. ఫుల్ లెంగ్త్ బౌలింగ్ చేసి క్యారీ వికెట్ తీయడానికి అశ్విన్ ప్రయత్నించి సఫలం అయ్యాడు.' అని పఠాన్ అన్నాడు. అశ్విన్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరీని రివర్స్ స్వీప్ చేయడానికి ప్రయత్నించిన క్యారీ బౌల్డ్ అయ్యాడు.
రెండో రోజు తొలి సెషన్ ఆట
భారత్- ఆస్ట్రేలియా రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా ఆధిపత్యం సాగింది. 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఈ సెషన్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. ఒక వికెట్ నష్టానికి 77 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (142 బంతుల్లో 85 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 12 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
రెండో రోజు ప్రారంభంలో రోహిత్ శర్మ, అశ్విన్ లు నిలకడగా ఇన్నింగ్స్ ను నడిపించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కొన్ని బంతులు పరీక్షించినప్పటికీ పట్టుదలగా క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా సహనాన్ని పరీక్షిస్తూ.. అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఈ జోడీ వికెట్ ఇవ్వకుండా దాదాపు గంటన్నరపాటు బ్యాటింగ్ చేసింది. రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు. అయితే తొలి రోజు రాహుల్ వికెట్ తీసిన మర్ఫీ అశ్విన్ (62 బంతుల్లో 23) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఆ వెంటనే పుజారా (14 బంతుల్లో 7)ను కూడా క్యాచ్ ఔట్ ద్వారా మర్ఫీనే పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది. అయితే మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కోహ్లీ సహకరిస్తున్నాడు.