Paddy Upton Meeting With India Bowlers: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ముగింట బౌలర్లు ఫామ్‌ కోల్పోవడం టీమ్‌ఇండియాను కలవరపెడుతోంది. 209 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్‌ చేసుకోలేకపోవడం ఇబ్బందిగా మారింది. సమస్యను వెంటనే సరిచేసుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది.


ఎమర్జన్సీ మీటింగ్‌


కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బౌలింగ్‌ కోచ్‌  పరాస్‌ మహంబ్రే గురువారం బౌలర్లతో అత్యవసరంగా సమావేశం అవుతున్నారు. మొహాలిలో ఏం జరిగింది? అసలెందుకు అలా బౌలింగ్‌ చేశారో తెలుసుకోనున్నారు. వికెట్లు తీయకపోవడానికి కారణాలను ఆరా తీస్తారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఈ మీటింగ్‌కు హాజరవుతున్నారు. సమావేశం ముగియగానే మెంటల్‌ కండిషనింగ్‌ కోచ్‌ ప్యాడీ అప్టన్‌ ప్రత్యేకంగా ఓ సెషన్‌ తీసుకుంటారని తెలిసింది.


మానసిక సమస్యలే కారణమా?


జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, హార్దిక్‌ పాండ్య, యుజ్వేంద్ర చాహల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌ ఈ సెషన్‌కు హాజరవుతున్నారు. మొహాలి పిచ్‌ ఫ్లాట్‌గా ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అయినప్పటికీ 209 రన్స్‌ డిఫెండ్‌ చేయకపోవడాన్ని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్సెప్ట్‌ చేయడం లేదు. ఐసీసీ ప్రపంచకప్‌లో ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఏం చేయాలన్న దానిపై చర్చించనున్నారు. మొహాలిలో సాంకేతికంగా కన్నా మానసికంగా బౌలర్లు ఎక్కువ తప్పులు చేశారని గుర్తించారు. అందుకే ప్యాడీ అప్టన్‌ ఒక్కో బౌలర్‌తో ప్రత్యేకంగా మాట్లాడనున్నాడు.


విరాట్‌కు అప్టన్‌ సాయం


ప్రపంచ క్రికెట్లో మానసిక సమస్యలను పరిష్కరించడం అత్యవసరం. లేదంటే జట్టు మొత్తంపై ఈ ప్రభావం ఉంటుంది. విరాట్‌ కోహ్లీ పరుగులు చేయలేక ఇలాంటి ఇబ్బందే పడుతున్నప్పుడు ప్యాడీ అప్టన్‌ అతడికి సాయం చేశాడు. ఒంటిరిగా చాలాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత విరాట్‌ పరుగుల వరద పారిస్తున్న సంగతి తెలిసిందే. బౌలర్లకు సైతం అతడి సాయం అవసరమని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.


నమ్మకమే బలం


ఒక మ్యాచులో విఫలమైనప్పటికీ బౌలర్లపై టీమ్‌ఇండియా నమ్మకంగానే ఉంది. 'నిజమే, 209 పరుగులని మన బౌలర్లు డిఫెండ్‌ చేయకపోవడం ఆందోళనకరమే. అయితే మొహాలి పిచ్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం అని మర్చిపోవద్దు. ఒక్క మ్యాచును చూసి వారి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు. పని సక్రమంగా జరిగేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో మేం మాట్లాడుతున్నాం' అని బీసీసీఐ సెలక్టర్‌ ఒకరు మీడియాకు తెలిపారు.


ఎవరెలా బౌలింగ్‌ చేశారంటే?


మొహాలి టీ20లో అక్షర్‌ పటేల్‌ మినహా బౌలర్లంతా సమష్టిగా విఫలమయ్యారు. భువీ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు. ఉమేశ్‌ యాదవ్ 2 వికెట్లు తీసినా 2 ఓవర్లకే 27 రన్స్‌ ఇచ్చాడు. యుజ్వేంద్ర చాహల్‌ 3.2 ఓవర్లలో ఒక వికెట్‌ తీసి 42 రన్స్‌ ఇచ్చాడు. హర్షల్‌ పటేల్‌ అయితే 4 ఓవర్లలో 49 రన్స్‌ ఇవ్వడం గమనార్హం. హార్దిక్‌ పాండ్య సైతం 2 ఓవర్లే వేసి 22 రన్స్ ఇచ్చాడు. అక్షర్‌ పటేల్‌ గనక వికెట్లు తీయకపోయి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది.